ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆసుపత్రుల్లో ఇన్​ఫెక్షన్లు బెడద.. నియంత్రణకు "హెచ్‌ఐసీసీ" కమిటీ - infections prevention in Hospitals

infections prevention in Hospitals: జబ్బు చేస్తే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతాం. అక్కడినుంచి ఆరోగ్యంగా ఇంటికి వెళతామని నమ్ముతాం. అలాంటిది దవాఖానాల్లోనే ఇన్‌ఫెక్షన్లు దాడి చేస్తే?.. కంచే చేను మేసినట్లు అవుతుంది. ఇటీవల రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వరుసగా చోటు చేసుకున్న మరణాలు ఇన్‌ఫెక్షన్ల కారణంగానే జరిగినట్లు వైద్యవర్గాలు ధ్రువీకరించాయి. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ హెచ్‌ఐసీసీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

infections prevention in Hospitals
infections prevention in Hospitals

By

Published : Jan 21, 2023, 10:58 AM IST

infections prevention in Hospitals: తెలంగాణలోని ఇబ్రహీంపట్నంలో స్వచ్ఛత (స్టెరిలైజేషన్‌) విధానాలను పాటించకపోవడం వల్ల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న నలుగురు మహిళలు, పేట్లబురుజు ఆసుపత్రిలోనూ సిజేరియన్‌ చేయించుకున్న మహిళ, తాజాగా మలక్‌పేట ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం ఇద్దరు మహిళలు మృతిచెందిన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణకు మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించి శుక్రవారం విడుదల చేసింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణ కమిటీ (హెచ్‌ఐసీసీ)లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. నర్సులకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తూ ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం..ఆసుపత్రిలో చేరిన రోగులు 48గంటలకు పైగా చికిత్స పొందాల్సి వస్తే.. వీరిలో సుమారు 10 శాతం మంది ఏదో ఒక కొత్త ఇన్‌ఫెక్షన్‌ బారినపడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో దవాఖానాల్లో వ్యాప్తి చెందే ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్న రోగులు 7% వరకూ ఉన్నారు.అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సుమారు 10 శాతం వరకూ ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తి చెందుతున్నాయి. వీటిలో రక్త, మూత్ర, శ్వాసకోశ, జీర్ణకోశ ఇన్‌ఫెక్షన్లు అధికంగా ఉంటున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ గణాంకాల ప్రకారం.. శస్త్రచికిత్స అనంతరం ప్రతి ముగ్గురిలో ఒకరు (సుమారు 33శాతం) ఏదో రకమైన ఇన్‌ఫెక్షన్‌ బారిన పడుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు తగిన సంఖ్యలో సిబ్బందిని నియమించుకున్న కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ కొన్ని రకాల సూక్ష్మక్రిములు సుమారు 5 నెలల వరకూ జీవిస్తుండగా.. అరకొర సిబ్బందితో పారిశుద్ధ్యాన్ని నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో కొన్ని రకాల మొండి సూక్ష్మక్రిములు సుమారు 30 నెలల వరకూ కూడా జీవిస్తుండడం ఆందోళనకరమైన అంశమే. అత్యాధునిక వసతులున్న కార్పొరేట్‌ స్థాయి ఆసుపత్రుల్లో ప్రతి 100 మంది రోగుల్లో ఏడుగురు ఇన్‌ఫెక్షన్ల బారినపడుతుండగా.. సాధారణ వసతులున్న మాధ్యమిక స్థాయి ఆసుపత్రుల్లో ప్రతి 100 మంది రోగుల్లో 15 మంది ఇన్‌ఫెక్షన్లకు గురవుతున్నారు. వీరిలో అత్యధికులు శస్త్రచికిత్స పొందిన రోగులు, ఐసీయూ రోగులు, నవజాత శిశువులు, ఐసీయూల్లో చికిత్స పొందే చిన్నారులున్నారు. సిజేరియన్‌ పొందిన మహిళల్లో దాదాపు 15 శాతం మంది ఇన్‌ఫెక్షన్లకు గురవుతున్నారు.

నిర్ణీత సమయాల్లో జీవ వ్యర్థాల తీసివేత :జీవ వైద్య వ్యర్థాలను నిర్దేశిత రంగు సంచుల్లో భద్రపర్చాలి. వీటిని తీసేసే సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్‌ ధరించాలి. జీవ వైద్య వ్యర్థాలను ఏ రోజుకారోజు సేకరించాలి. అది కూడా రోజూ ఒక నిర్ణీత సమయంలోనే సేకరించాలి. ఉదాహరణకు రోజూ ఉదయం 11-12 గంటల సమయంలో తీసేయడానికి ప్రాధాన్యమివ్వాలి. జీవ వైద్య వ్యర్థాలను తీసేసే సమయంలో సాధారణ వ్యర్థాలను తొలగించొద్దు. ఒకే ట్రాలీని రెండింటికీ వినియోగించొద్దు. రోగుల పడకలకు సమీపంలో భద్రపర్చకూడదు. ఏరోజుకారోజు వాటిని ఆసుపత్రి నుంచి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలి. 30 పడకలకు పైనున్న ప్రతి ఆసుపత్రిలోనూ జీవ వైద్య వ్యర్థాల సమాచారాన్ని పొందుపర్చాలి.

ప్రతి వస్తువునూ శుభ్రపర్చాల్సిందే :సర్జరీల్లో వినియోగించే వస్తువులను, పరికరాలను ఆటోక్లేవ్‌ మిషన్‌లో స్టెరిలైజ్‌ చేయాలి. ఆ మిషన్‌ పనిచేస్తుందో లేదో ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలి.అందులోనూ ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ ఉందా? అనేది పరీక్షిస్తుండాలి. రోగికి చికిత్స అందించే గదిలో గచ్చు, కిటికీలు, గోడలు సహా ప్రతి మూలనూ రోజూ శుభ్రపర్చాలి. కిటికీ కర్టెన్లు, కవర్లను కనీసం నెలకోసారి ఉతకాలి. ఆపరేషన్‌ థియేటర్‌ను ప్రతిరోజూ సర్జరీలు మొదలవడానికి ముందే శుభ్రపర్చాలి. థియేటర్‌ లోపలి భాగంలో ఉన్న ప్రతి వస్తువును, పరికరాల ఉపరితలాలను కూడా శుభ్రం చేయాలి. గచ్చును రోజూ, గోడలను వారానికి ఒకసారి శుభ్రపర్చాలి.

ఒకవేళ శుభ్రపర్చకపోతే అందులోకి వైద్యులు వెళ్లకూడదు. సర్జరీలు పూర్తయిన తర్వాత అదే రోజు మళ్లీ రసాయనాలతో శుభ్రపర్చాలి. ఒక సర్జరీకి మరో సర్జరీకి మధ్యలో కూడా 15 నిమిషాల వ్యవధిలో తలుపులు మూసి, కాలుష్యాన్ని బయటకు పంపే యంత్రాలను వినియోగించాలి. ఆపరేషన్‌ గదిలోనూ ఇన్‌ఫెక్షన్లను కనుగొనడానికి వారానికి ఒకసారి నమూనాలను సేకరించి పరీక్షించాలి. రోగి ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పుడు వెంటిలేటర్‌కు ఉన్న ఫిల్టర్‌ను శుభ్రపర్చాలి. ప్రతి రోగికి కొత్త ఫిల్టర్‌ను అమర్చాలి. వీటిని మూడు రోజులకోసారి మార్చాలి. అందులో పోసే స్వచ్ఛమైన నీటిని 8 గంటలకోసారి మార్చాలి. లేకపోతే ఇన్‌ఫెక్షన్ల బారినపడే అవకాశం ఉంటుంది.

సూక్ష్మక్రిముల వ్యాప్తి ఎలా?

* కలుషిత గాలి

* కాళ్లు, చేతులు శుభ్రపర్చుకోకుండా తాకడం

* అపరిశుభ్ర దుస్తులు, వస్తువులు

* సహాయకులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం

* సూదులు, బ్లేడ్‌ల వినియోగంలో ప్రమాణాలు పాటించకపోవడం

ఇన్‌ఫెక్షన్ల నివారణకు ఇలా చేయాలి.. ప్రభుత్వ మార్గదర్శకాలిలా..

చేతుల శుభ్రత చాలా ముఖ్యం :ఆసుపత్రుల్లో చేతుల శుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఉంది. రోగిని తాకడానికి ముందే కచ్చితంగా చేతులను శానిటైజర్‌ లేదా సబ్బుతో శుభ్రపర్చుకోవాలి. రోగికి చికిత్స అనంతరం కూడా ఇదే విధంగా చేయాలి. చేతి వేళ్ల మధ్య భాగం సహా అన్ని మూలలనూ శుభ్రపర్చాలి. పడకనూ, పరికరాలను, కిటికీలను, కర్టెన్లనూ వేటిని ముట్టుకున్నా చేతులను శుభ్రపర్చుకోవాల్సిందే. సర్జరీకి ముందైతే కనీసం 10 నిమిషాల పాటు చేతులను శుభ్రపర్చుకోవాలి. ఆసుపత్రుల్లో రోగులకు అందించే ఆహారాన్ని వండిన రెండు గంటల్లోపు సరఫరా చేయాలి. లేదంటే వినియోగించొద్దు. తయారు చేసిన ఆహార పదార్థాలను గోడలకు దూరంగా.. నేలకు 6 అంగుళాల పైభాగంలో ఉంచాలి.

దుప్పట్లను రోజూ మార్చాల్సిందే :పడకలపై దుప్పట్లను రోజూ మార్చాలి. ఒకే రోజు ఒక రోగి స్థానంలో మరో రోగి పడుకోవాల్సి వచ్చినా.. దుప్పటి మార్చాలి. రక్తం మరకలు గానీ, ఇంకేదైనా పడినా అప్పటికప్పుడు మార్చాల్సిందే. ఒక్కో పడకకు కనీసం 5 దుప్పట్లను అదనంగా అందుబాటులో ఉండాలి. వాడిన దుప్పట్లను, దుస్తులను తీసుకెళ్లడానికి చిన్న చిన్న బ్యాగులను ఎక్కువ సంఖ్యలో వాడకుండా.. ఒక్కటే పెద్ద బ్యాగును ఉపయోగించాలి. ఆ బ్యాగులోనూ మొత్తం కాకుండా.. మూడింత రెండొంతులే నింపాలి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details