Telangana EAMCET Exam Date 2023 : తెలంగాణలో ఎంసెట్‌ను మే 7 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఎంసెట్ (ఇంజినీరింగ్; అగ్రికల్చర్, ఫార్మసీ) సహా 6 ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం తన కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులతో సమావేశమై తేదీలను ఖరారు చేసి వెల్లడించారు.
పీజీ ఇంజినీరింగ్ సెట్‌ను మొత్తం 4 రోజులు నిర్వహిస్తున్నారు. ఈ తేదీల్లో జూన్ 1 కూడా ఉండగా.. మిగిలిన అన్ని పరీక్షలు మే నెలలోనే నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్లను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య వి.వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన పాల్గొన్నారు.