ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిల్లీ బ్రోకర్​లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూశారు.. కానీ: సీఎం కేసీఆర్

KCR COMMENTS IN CHANDURU MEETING: కొందరు దిల్లీ బ్రోకర్‌లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూస్తే.. మన ఎమ్మెల్యేలు ఎడమకాలి చెప్పుతో కొట్టినట్టు చేశారని సీఎం కేసీఆర్‌ అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ బావుటా ఎగురవేశారన్న కేసీఆర్​.. ఇలాంటి ఎమ్మెల్యేలే దేశానికి కావాల్సిందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగడ్డలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్​ మాట్లాడారు.

KCR COMMENTS IN CHANDURU MEETING
KCR COMMENTS IN CHANDURU MEETING

By

Published : Oct 30, 2022, 5:35 PM IST

Updated : Oct 30, 2022, 7:49 PM IST

KCR COMMENTS IN CHANDURU MEETING: కొందరు దిల్లీ బ్రోకర్‌లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూస్తే.. మన ఎమ్మెల్యేలు ఎడమకాలి చెప్పుతో కొట్టినట్టు చేశారని సీఎం కేసీఆర్‌ అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగడ్డలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మునుగోడులో అవసరం లేని ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక ఫలితాన్ని మునుగోడు ప్రజలు ఎప్పుడో తేల్చేశారు. ఎన్నికలు రాగానే లొల్లి మొదలవుతుంది. గాయిగాయి గత్తర్‌ గత్తర్‌ చేస్తారు.. విచిత్ర వేషధారులందరూ ఎన్నికలప్పుడు వస్తారు. ఎవరు ఏమి చెప్పినా నిజానిజాలపై ప్రజలు విస్తృతంగా చర్చించాలి. ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే ఇల్లు కాలిపోతుంది. ఆలోచించి ఓటు వేస్తే మన ఊరు, మునుగోడు, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం బాగుపడుతుంది. దేశంలో ఏం జరుగుతుందో ప్రజలు బాగా ఆలోచించుకోవాలి. గాయిగాయి గత్తర్‌ గత్తర్‌ కావొద్దు. కరిచే పాములను మెడలో వేసుకునేందుకు సిద్ధపడతారా?

చండూరు సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్​

చేనేత కార్మికులు తగిన బుద్ధి చెప్పాలి...కొందరు దిల్లీ బ్రోకర్‌లు మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూశారు. ఎడమకాలి చెప్పుతో కొట్టినట్టు మేం తెలంగాణ బిడ్డలమని నలుగురు ఎమ్మెల్యేలు తేల్చి చెప్పి.. తెలంగాణ బావుటా ఎగురవేశారు. ఇలాంటి ఎమ్మెల్యేలు దేశానికి కావాల్సింది. రూ.100 కోట్లు ఇస్తామని ఆశ చూపితే.. గడ్డిపోచలా విసిరేశారు. దిల్లీ నుంచి దుర్మార్గమైన పని చేసి చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూలదోయాలని భాజపా చూస్తోంది.

దేశాన్ని పాలించే అవకాశం ఇచ్చినా.. రాష్ట్రాల్లో కుట్రలు ఎందుకు? ప్రజలు మోదీని రెండుసార్లు ప్రధానిని చేసినా ప్రభుత్వాలను ఎందుకు కూల్చాలి. ఎమ్మెల్యేలను కొనేందుకు భాజపాకు రూ. వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. దేశంలో ఏ ప్రధాని చేయని దారుణాలు ప్రధాని మోదీ చేశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ వేసిన తొలి ప్రధాని మోదీ. కేంద్రానికి బుద్ది రావాలంటే చేనేత కుటుంబాలు భాజపాకు ఒక్క ఓటు కూడా వేయకుండా.. తగిన బుద్ధి చెప్పాలి.

భాజపాకు డిపాజిట్‌ వచ్చినా నన్ను పక్కకు నెట్టేస్తారు?..దేశంలో 4లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల విద్యుత్‌ ఇవ్వడం లేదు. కానీ, విద్యుత్‌ సంస్కరణల ముసుగులో మీటర్లు పెట్టాలని కేంద్రం చూస్తోంది. బావి వద్ద మోటార్లతో పాటు ఇళ్లలోనూ మీటర్లు మార్చాలని మోదీ చూస్తున్నారు. రూ.30వేలు చెల్లించి ఇంట్లో మీటరు మార్చుకోవాలని మోదీ ఆదేశాలు జారీ చేశారు. మీటర్లు పెట్టుకుని కొంపలు ఆర్పుకుందామా? మీటర్లు పెడదామనుకన్న వారికి మీటరు పెడదామా? భాజపాకు ఓటు వేస్తే.. విద్యుత్‌ చట్టాలను అంగీకరించినట్టే. భాజపాకు డిపాజిట్‌ వచ్చినా నన్ను పక్కకు నెట్టేస్తారు? ఆశ పడితే గోస పడతాం.

60 ఏళ్ల కింద చిన్న పొరపాటు జరిగితే 58 ఏళ్ల పాటు కొట్లాడినం. చివరికి నేను కూడా చావు నోట్లో తలపెట్టి కొట్లాడితే తప్ప తెలంగాణ రాలేదు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయకపోతే .. పెట్టుబడి దారులను మనమే ప్రోత్సహించినట్లవుతుంది. మా బలం, బలగం మీరే.. మీరే అండగా లేకపోతే ఎవరికోసం పోరాడాలి. ప్రపంచంలో ఏ దేశానికి లేని అనుకూలమైన భూమి భారత్‌కు ఉంది. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది.

మునుగోడు ప్రజలకు సువర్ణావకాశం వచ్చింది..దేశ రాజకీయాలను మలుపుతిప్పే సువర్ణావకాశం మునుగోడు ప్రజలకు వచ్చింది. తెలంగాణ మాదిరిగానే భారత్‌ను చేయాలని పుట్టుకొచ్చిందే బీఆర్‌ఎస్‌. భారతదేశ రాజకీయాలకు పునాదిరాయి వేసే అవకాశం మునుగోడుకే దక్కింది. ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి ప్రోత్సహించాలి. మునుగోడును కడుపులో పెట్టుకుంటా. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి.. మునుగోడులో ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే బాధ్యత నాది. కృష్ణా జలాల్లో మా వాటా తేల్చేందుకు మోదీకి ఎనిమిదేళ్లు సరిపోలేదా?.. రాష్ట్రంలో వడ్లు కొనని మోదీ సర్కారుకు.. రూ.వందల కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనడం చేతనవుతోంది. రూపాయి విలువ పతనానికి కారణం ఎవరు? గ్యాస్‌, పెట్రోల్‌ ధర పెరిగింది, నిత్యావసరాల ధరలు పెరిగాయి, చేనేతపై జీఎస్టీవేశారు.. వీటిపై మీరు పోరాడాలి.

విద్యుత్‌ ప్రైవేటీకరణ జరిగితే దారుణ ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిన్న, మొన్న మీరు టీవీలల్లో చూసింది కొందే.. ఇంకా చాలా ఉంది. రాజ్యాంగబద్దమైన సీఎం పదవిలో ఉన్నందున ఎక్కువ చెప్పలేకపోతున్నా. విచారణను ప్రభావితం చేసినట్లు అవుతుందని పూర్తిగా చెప్పట్లేదు. మతోన్మాదులు, పెట్టుబడుదారి తొత్తులు, ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూలదోసే వారిని తన్ని తరిమేయాలి. బలవంతంగా మనమీద రుద్దిన ఉపఎన్నిక వారికి చెంపపెట్టు కావాలి’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సభకు హాజరయ్యారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 30, 2022, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details