Telangana Budget 2023: తెలంగాణ వార్షిక బడ్జెట్ మొదటిసారి మూడు లక్షల కోట్ల మార్కు దాటనుంది. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ కావడంతో మరోమారు భారీ బడ్జెట్ రానుంది. సంక్షేమం, అభివృద్ధి పథకాలకు పెద్దపీట వేస్తూ పద్దును ప్రతిపాదించనున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షలా 56 వేల కోట్లు కాగా వచ్చే ఏడాది వృద్ధిరేటు 15 నుంచి 17 శాతం వరకు ఉండవచ్చని అంచనా వేసి ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. దీంతో 2023- 24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ మూడు లక్షల కోట్లు దాటినట్లు తెలిసింది.
ఎన్నికలకు ముందు వస్తున్న బడ్జెట్ కావడంతో సంక్షేమ రంగానికి సింహభాగం నిధులు కేటాయించినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలకు నిధులు పెరిగాయి. సొంత రాబడిపైనే ఎక్కువగా ఆధారపడి పూర్తి విశ్వాసంతో ఆశావాహ బడ్జెట్‌ను రూపొందించారు.
సొంత రాబడులే కీలకం :ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నెల వరకు వచ్చిన రాబడులను విశ్లేషించిన ఆర్థిక శాఖ... రానున్న ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడి లక్షన్నర కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేసినట్లు సమాచారం. పన్నేతర ఆదాయం రుణాలు, గ్రాంట్లు కలిపి మరో లక్షన్నర కోట్లుగా అంచనా వేసి మొత్తం మూడు లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు ఖరారు చేసినట్లు తెలిసింది.
సొంత పన్నులపై పూర్తి విశ్వాసంతో రాబడి అంచనాలను గణనీయంగా పెంచారు. అమ్మకం పన్ను ద్వారా 40 వేల కోట్లు, జీఎస్టీ ద్వారా 42 వేల కోట్లు, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల ద్వారా 18 వేల కోట్ల ఆదాయం వస్తుందని... గనుల ద్వారా 9వేల కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. భూముల అమ్మకం ద్వారా వచ్చేయడానికి ఆదాయం భారీగా పెరుగుతుందని అంచనా వేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రాష్ట్రానికి 21వేల 470 కోట్లు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాల నిధులు రానున్నాయి.