Teachers Transfers in Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, బదిలీల వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాలను ఇవాళ ఆన్‌లైన్‌లో ప్రకటించనున్నారు. రేపటి నుంచి ఈ నెల 30 వరకు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనుండగా.. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు హార్డ్‌కాపీలను సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 3 నుంచి 6 వరకు దరఖాస్తులకు ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, డీఈవోలు ఆమోదం తెలియజేస్తారు.
Teachers promotions in Telangana: ఈ బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఫిబ్రవరి 7న డీఈవో, ఆర్జేడీ వెబ్‌సైట్లలో సీనియారిటీ జాబితా ప్రకటిస్తారు. ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు సీనియారిటీ జాబితాపై మూడ్రోజులు అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించనున్నారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో తుది సీనియారిటీ జాబితాల ప్రకటన, ప్రధానోపాధ్యాయుల బదిలీలకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. ఫిబ్రవరి 13న మల్టీ జోనల్ స్థాయిలో ప్రధానోపాధ్యాయుల వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పునః పరిశీలన చేపడతారు. ఫిబ్రవరి 14న ఆర్జేడీలు ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులను విడుదల చేస్తారు.
Teachers Transfers Schedule in Telangana: ఫిబ్రవరి 15న ప్రధానోపాధ్యాయుల బదిలీల అనంతరం మిగిలిన ఖాళీలను ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలల హెచ్ఎంల పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల ప్రకటన, బదిలీ ఆప్షన్స్ నమోదు ఉంటుంది. ఫిబ్రవరి 21న ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలనకు అవకాశం కల్పించి.. ఫిబ్రవరి 22, 23 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీకి డీఈవోలు ఉత్తర్వులు విడుదల చేస్తారు. ఫిబ్రవరి 24న స్కూల్ అసిస్టెంట్స్ బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీలు ప్రకటిస్తారు. ఫిబ్రవరి 25 నుంచి 27 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు కోర్టు కేసులు లేని సబ్జెక్టులకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతులు కల్పిస్తారు. ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన పోస్టుల ఖాళీలు ప్రకటించి, వెబ్ ఆప్షన్లు నమోదు చేస్తారు. మార్చి 3న ఆప్షన్ల సవరణ, పునః పరిశీలనకు అవకాశం కల్పించి.. మార్చి 4న ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల చేస్తారు. మార్చి 5 నుంచి 19 వరకు డీఈవో ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీళ్లు, అభ్యంతరాలను ఆర్జేడీకి, ఆర్జేడీ ఉత్తర్వులపై అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు పంపాలి. దరఖాస్తు అందిన 15 రోజుల్లో సంబంధిత అధికారులు వాటిని పరిష్కరిస్తారు.