Teachers in Election Duty Big Shock to CM Jagan: వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల విధుల్లో టీచర్లను నియమించాలని సీఈవో తెలిపింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులుగా పనిచేసేందుకు అర్హత గలవారి వివరాలను అన్ని ప్రభుత్వ శాఖల నుంచి భారత ఎన్నికల సంఘం సేకరిస్తోంది. అందులో భాగంగా ఉపాధ్యాయుల వివరాలనూ ఇవాళ్టిలోగా పంపాలని ఆదేశించింది. ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు అర్హత ఉన్న అధికారులు, సిబ్బంది వివరాలను పంపించాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.
జిల్లా పరిధిలో మొత్తం ఎంతమంది పోలింగ్ సిబ్బంది అవసరం.? ఎన్నికల విధుల నిర్వహణకు ఎంతమంది ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు.? గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మినహా మిగతా శాఖల సిబ్బంది ఎంతమంది ఉన్నారు.? గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మొత్తం ఎందరు ఉన్నారు.? అంశాలతో వివరాలు పంపించాలని కోరింది. ఈ సమాచారాన్ని సేకరించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈసీ(CEC)కి పంపనున్నారు.
రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాలు, వాటిలో అవసరమైన అధికారుల సంఖ్య, అందుబాటులో ఉన్నవారి సంఖ్య తదితర వివరాలు పరిశీలించాక ఏయే శాఖల ఉద్యోగులను నియమించాలో సీఈసీ(Central Election Commission) తుది నిర్ణయం తీసుకుంటుంది. ఉపాధ్యాయులకూ ఈ బాధ్యతలు ఇవ్వాలని సీఈసీ అనుకుంటే వారూ ఎన్నికల విధుల్లో భాగస్వాములవుతారు. ఇదే జరిగితే జగన్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది. అయితే సీఈసీ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.