వైకాపా నేతల అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. అధికారం అండతో సామాన్యులపై దాష్టీకాలకు పాల్పడుతున్నారు. తమ ఇంటికి వెళ్లే దారిని ఆక్రమించి వైకాపా సానుభూతిపరుడు గోడకట్టడంతో...తన గోడు సీఎం జగన్‌కు వినిపించేందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బిడ్డలతో కలిసి పాదయాత్ర చేపట్టింది. మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు బలవంతంగా ఆమెను తిరిగి వెనక్కి పంపించేశారు.
కన్నబిడ్డలతో వీల్‌ఛైర్‌లో పాదయాత్ర చేస్తున్న ఈమె ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాలు. వైకాపా సానుభూతిపరుడు తన ఇంటికి వెళ్లే దారిని ఆక్రమించి గోడకట్టాడని...ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి జగనే తనకు న్యాయం చేయాలంటూ కన్నబిడ్డలతో కలిసి ఆమె పాదయాత్ర చేప్టటింది. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంకు చెందిన గొట్టిపాటి సుధారాణి...ఈనెల 17న మేదరమెట్ట నుంచి పాదయాత్ర చేపట్టారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆమెను వీల్‌ఛైర్‌లో కూర్చోబెట్టుకుని ఇద్దరు కుమారులు, కుమార్తె కాలినడకన తాడేపల్లికి బయలుదేరారు. శనివారం సీఎం నివాసానికి సమీపంలోని కొలనుకొండ వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో వారు జాతీయరహదారిపైనే భైఠాయించి నిరసన తెలిపారు.