గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం పట్టణంలో అన్వర్ షరీఫ్ టీ దుకాణం నిర్వహిస్తుంటాడు. అయితే కరోనా కారణంగా వ్యాపారం మునుపటిలా లేదు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ బయట టీ తాగేవారు తగ్గిపోయారు. ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా.. మళ్లీ తన వ్యాపారం పుంజుకోవటం కోసం ఏం చేయాలని ఆలోచించాడు. ఈ క్రమంలో బెల్లం టీ ఆలోచన వచ్చింది. అందులో అల్లాన్ని జోడించటం ద్వారా ఆయుర్వేద గుణాలు వచ్చేలా చర్యలు తీసుకున్నాడు.
గాజు, పింగాణి కప్పుల్లో కాకుండా... మట్టి గ్లాసులో ఇవ్వటం మొదలుపెట్టాడు. బెల్లం మన జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. మట్టిపాత్రల వినియోగం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఇలా మట్టి గ్లాసులో ఇచ్చే బెల్లం టీకి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతానికి వారంలో రెండు రోజులు మాత్రమే బెల్లం టీ లభిస్తుంది. మంచి ఆదరణ లభిస్తున్న దృష్ట్యా... దీన్నిరోజూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అన్వర్ షరీఫ్ తెలిపారు.