TDP Youth Wing Agitations for Job Notifications: జగన్ ప్రభుత్వం నిరుద్యోగలను నిలువునా ముంచిందంటూ తెలుగు యువత భగ్గుమంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. గుంటూరు జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద ఖాళీ విస్తర్లతో సహపంక్తి భోజనాలకు కూర్చుని తెలుగుయువత నాయకులు వినూత్న నిరసన తెలిపారు.
'జ్యాబ్ క్యాలెండర్' అని రాసిఉన్న ఖాళీ బకెట్‌తో ఓ వ్యక్తి వడ్డిస్తుండగా.. పంక్తిలో కూర్చున్నవారు ఇందులో ఏమీ లేదుగా అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. శాంతియుతంగా నిరసన తెలిపితే తప్పేంటని యువ నాయకులు నిలదీశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
అధికారంలోకి రాకముందు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న సీఎం జగన్ ఇంతవరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్నారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నోటిఫికేషన్ గారడీలను మానుకోవాలని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని తెలుగు యువత డిమాండ్ చేశారు. నిరసన చేసిన తెలుగు యువత నాయకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరుద్యోగులతో కలిసి తెలుగుయువత నిరసన తెలిపింది. రోస్టర్ విధానం పాటించని నోటిఫికేషన్ ఎందుకని నాయకులు ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను జగన్ మోసం చేస్తున్నారంటూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఎలక్షన్ ముందు తూతూమంత్రంగా విడుదల చేయటం సిగ్గు సిగ్గు అంటూ నినదించారు. నాలుగున్నర సంవత్సరాలగా నిరుద్యోగ యువత బోలెడంత ఆశతో ఎదురు చూస్తే వారికి నిరాశే మిగిలిందని అన్నారు.