TDP Anitha Letter to NCW and DGP: వైసీపీ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి నేరాల నియంత్రణకు బదులుగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటోందని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. టీడీపీ మహిళా నేత ముల్పూరి కల్యాణి అక్రమ అరెస్టుపై చర్యలు కోరుతూ.. జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ), డీజీపీకి ఆమె లేఖ రాశారు. గత మూడున్నరేళ్లలో డ్రగ్స్ నేరాలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారిందని, మాదకద్రవ్యాల దుర్వినియోగంతో పాటు మహిళలపై నేరాలు, అఘాయిత్యాలు క్రమంగా పెరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేస్తే తమ పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసి.. ముల్పూరి కల్యాణిని నిందితురాలిగా చేర్చారని అనిత ధ్వజమెత్తారు. ఏప్రిల్ 10వ తేదీన గన్నవరం, హనుమాన్ జంక్షన్ పోలీసులు కల్యాణి ఇంట్లోకి చొరబడి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారని ఆక్షేపించారు. దుస్తులు మార్చుకునేందుకు కూడా అనుమతించలేదని.. తమ సమక్షంలోనే దుస్తులు మార్చుకోవాలని బలవంతం చేశారని ఆమె ఆరోపించారు.
పోలీసులు ఇలా వ్యవహరించటం కల్యాణి వ్యక్తిగత స్వేచ్ఛా హక్కును తీవ్రంగా ఉల్లంఘించడమే అని అనిత మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసులు.. మహిళలపై నేరాలు కట్టడి చేసే బదులు ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర డీజీపీకి అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదని అనిత విమర్శించారు. ఇప్పుడు కల్యాణి అక్రమంగా అరెస్టు ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని అనిత కోరారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.