ఎంపీ గల్లా అకౌంటెంట్ ఇంటిపై ఐటీ దాడులు - collectorate
ఎన్నికల వేళ గుంటూరులో ఐటీ దాడులు కలకలం రేపాయి. ఎంపీ గల్లా జయదేవ్ చీఫ్ అకౌంటెంట్ ను ఐటీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాడులను ఖండిస్తూ ఎంపీ గల్లాతో పాటు తెదేపా నేతలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
గుంటూరులో ఐటీ దాడులు కలకలం రేపాయి. ఎంపీ గల్లా జయదేవ్ అకౌంటెంట్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అకౌంటెంట్ గుర్రపునాయడుని విచారణ పేరుతో అదుపులోకి తీసుకోవటంతో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గల్లా జయదేవ్ ఆందోళనకు దిగారు. తమ చీఫ్ అకౌంటెంట్‌ను విచారణ పేరుతో హింసిస్తున్నారని..ఆరు గంటలకు పైగా గృహనిర్బంధంలో ఉంచారని గల్లా మండిపడ్డారు. ఈడీ , ఐటీ సంస్థలను ప్రధాని మోదీ దుర్వినియోగపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ దాడులను ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. రాజకీయ కక్షలు నేపథ్యంలోనే ఇలాంటి కుట్ర రాజకీయాలకు తెరలేపారని, జగన్‌ను గెలిపించటమే లక్ష్యంగా కేంద్రం ఇలా వ్యవహారిస్తోందని గల్లా ఆరోపించారు. మరోవైపు విచారణ ముగియటంతో ఐటీ శాఖ అధికారులు గుర్రపునాయుడుని విడుదల చేశారు. అనంతరం ఎంపీ గల్లా, తెదేపా నాయకులు ఆందోళనను విరమించారు.