గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ స్థానంపై స్పష్టమైన హామీ లభించకపోవడం... సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు అసంతృప్తి కారణమైంది. ఆయన అనుచరులతో సమావేశమై... సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికైతే... పార్టీ మారనని... అధినేతపై నమ్మకం ఉందని చెప్పారు. ఆదినుంచి నరసరావుపేట పార్లమెంటు సీటుపై చర్చలు సాగుతున్నాయి. వయసు రీత్యా రాయపాటికి ఈసారి టిక్కెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం ఎప్పటినుంచో సాగుతోంది.
నరసరావుపేట పార్లమెంటు స్థానానికి బదులుగా... సత్తెనపల్లి అసెంబ్లీ సీటును రాయపాటి తనయుడు రంగారావుకు ఇవ్వొవచ్చనే ప్రచారం జోరుగా సాగింది. పార్టీ అధిష్ఠానం కూడా నరసరావుపేట ఎంపీగా సభాపతి కోడెలను పోటీ చేయించాలని భావించింది. దిల్లీ రాజకీయాలు తనకు పడవంటూ... పోటీ చేసేందుకు సభాపతి నిరాకరించారు. ఆయన కోరుకున్నట్లుగానే మళ్లీ సత్తెనపల్లి నుంచి పోటీకి దిగడానికి సుముఖత వ్యక్తం చేశారు.
అయితే రాయపాటికే మళ్లీ ఎంపీ స్థానం ఖరారు కావచ్చని అంతా భావించారు. ఈలోగానే భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ రామకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. ఈ విషయమై 3 రోజులుగా చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. వైకాపా తరఫున విజ్ఞాన్ విద్యాసంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య కుమారుడు... శ్రీకృష్ణదేవరాయలు బరిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అన్నివిధాలా పోటీకి సరితూగేలా... రామకృష్ణ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.