ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP Satyagraha Campaign Against Illegal Exploitation of Sand: ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సత్యాగ్రహ దీక్షలు - వైసీపీ అక్రమాలపై సత్యాగ్రహ దీక్ష

TDP Satyagraha Campaign Against Illegal Exploitation of Sand: రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా.. టీడీపీ శ్రేణులు రెండో రోజు ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేశాయి. రెండోరోజు నిరసనలో భాగంగా తహశీల్దార్‌ కార్యాలయాల్లో, పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఈ నెల 30న మైన్స్‌ అండ్‌ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడి చేయనున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు.

tdp-organized-a-satyagraha-campaign-against-the-illegal-exploitation-
tdp-organized-a-satyagraha-campaign-against-the-illegal-exploitation-

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2023, 5:54 PM IST

Updated : Aug 28, 2023, 9:15 PM IST

TDP Satyagraha Campaign Against Illegal Exploitation of Sand: ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సత్యాగ్రహ దీక్షలు

TDP Satyagraha Campaign Against Illegal Exploitation of Sand: రాష్ట్రవ్యాప్తంగా ఇసుక దోపిడీలపై మూడు రోజుల నిరసనలకు తెలుగుదేశం పిలుపునిచ్చింది. నిరసనలో భాగంగా నేడు అక్రమ ఇసుక రీచ్‌లు, డంపింగ్ యార్డుల వద్ద టీడీపీ శ్రేణులు నిరసనలు చేపట్టారు. రెండో రోజు నిరసనలో భాగంగా తహసీల్దార్‌ కార్యాలయాల్లో, పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేయనున్నారు. ఈ నెల 30న మైన్స్‌ అండ్‌ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడి చేయనున్నట్లు టీడీపీ నేతలు వెల్లడించారు.

ఎన్టీఆర్‌ జిల్లా: మైలవరం ఇసుక నిల్వ కేంద్రం వద్ద దేవినేని ఉమ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల ఇసుక మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు. కంచికచర్ల మండలం ఆత్కూరు గ్రామంలో అక్రమ ఇసుక రవాణాను వెంటనే నిలుపుదల చేయాలంటూ.. టీడీపీ శ్రేణులతో కలసి ఇసుక సత్యాగ్రహం కార్యక్రమానికి వెళుతున్న మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్యని రహదారిపైనే పోలీసు యంత్రాంగం నిలువరించారు. "ఇసుకాసుర - జగనాసుర" అంటూ ఆమె రోడ్డు పైనే ఇసుక సత్యాగ్రహంలో పాల్గొన్నారు.

కృష్ణాజిల్లా: జగన్మోహన్​రెడ్డి రాష్ట్రంలో నలభై వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ చేశారని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా, ఘంటసాల మండలం, శ్రీకాకుళం వద్ద కృష్ణానదిలో టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీ నేతలు ఇసుక సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. నదిలో ఇసుక తవ్వకాలు ఆపాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా.. అక్రమ రవాణ ఆగడం లేదని ఆరోపించారు.

బాపట్ల జిల్లా: రాష్ట్రంలో అడ్డగోలు ఇసుక తవ్వకాల ద్వారా 40 వేల కోట్ల రూపాయల విలువైన ఇసుకను తరలించారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం జువ్వలపాలెం ఇసుక రీజ్ వద్ద జరిగిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తవ్వి నిల్వ చేశారని అరోపించారు. అనుమతులు ఉంటే అధికారులు చూపించాలని సవాల్ విసిరారు.

గుంటూరు జిల్లా: ఇసుక అక్రమాలపై ధర్నాకు పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్​ను తాడేపల్లిలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలోని ఇసుక రీచ్​లో ధర్నాకు శ్రావణ్ పిలుపునిచ్చారు. తాడేపల్లి మండలం గుండిమెడలో అక్రమ ఇసుక రవాణాను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. ఐదు జేసీబీలతో ఇసుక డంప్ చేస్తున్న ప్రాంతంలో టీడీపీ నేతలు ఆందోళన నిర్వహించారు.

తూర్పు గోదావరి జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా ఇసుక సత్యాగ్రహం పేరిట చేపట్టిన నిరసన కార్యక్రమం రాజమహేంద్రవరంలో.. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ధవళేశ్వరం గాయత్రి ఇసుక ర్యాంపు-1 వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ కొనసాగుతోందని ఎమ్మెల్యే బుచ్చయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిలో రాత్రిళ్లు యంత్రాలతో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక దోపిడీ చేస్తున్నారని అన్నారు. యంత్రాలతో ఇసుక తవ్వయడంవల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని బోట్స్ మెన్ సొసైటీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

మన్యం జిల్లా: పాంచాలి సమీపంలోని వట్టి గెడ్డ నది తీరంలో ఇసుక అక్రమ రవాణాపై టీడీపీ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా చేయడం వల్ల సమీప గ్రామాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. ఎన్జీటీ ఆదేశాలను భేఖాతరు చేస్తూ... వైసీపీ నాయకులు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

నెల్లూరు రూరల్: మినగల్లు ఇసుక రీచ్ వద్దకు ఆందోళనకు బయలుదేరుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసుల మోహరించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేయటంతో పార్టీ కార్యాలయం వద్దకు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారంటూ నెల్లూరులో జనసైనికులు ఆందోళన వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ప్రశ్నించినందుకే తమపై కేసు పెట్టారని జనసేన నేత కిషోర్ ఆందోళన వ్యక్తం చేశారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఇసుక అక్రమంగా తరలించే వారికి పోలీసులు సహకరిస్తున్నారని టీడీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు ఆరోపించారు. బ్రహ్మసముద్రం మండలం అజ్జయ్యదొడ్డి ఇసుక రీచ్ వద్ద ఆందోళన చేపట్టేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవటంతో వాగ్వాదం జరిగింది. తిరుపతి రూరల్, చంద్రగిరి, ఇసుక రీచ్‌ల వద్ద పార్టీ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. చంద్రగిరిలో స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.

కర్నూలు జిల్లా: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక దోపిడీ ఎక్కువైందని కర్నూలులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు సమీపంలోని దిన్నదేవరపాడు వద్దనున్న ఇసుక డంపు వద్ద ఇసుక దోపిడీ కి వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఇసుక పేరుతో వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.

Last Updated : Aug 28, 2023, 9:15 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details