గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో పార్టీ శ్రేణులు కదంతొక్కారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో తరలివచ్చిన రైతులు చిలకలూరిపేట కార్యాలయం నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని వినతిపత్రం ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, తెదేపా రాష్ట్ర నాయకులు పిల్లి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో తెదేపా నాయకుల ట్రాక్టర్లు, ఎద్దులతో వినూత్న ర్యాలీ నిర్వహించారు. రైతు ఆత్మహత్యలలో దేశంలోనే రాష్ట్రం మూడవ స్థానంలో ఉందని రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైకాపా విఫలమైందని.. సకాలంలో వర్షాలు పడినా కనీసం పంటలకు నీరు ఇవ్వని దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. రైతు వ్యతిరేక చట్టాలపై తెదేపా పోరాటం చేస్తూనే ఉంటుందని..వైకాపా నేతలకు ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని అన్నారు.
తెలుగుదేశం చేపట్టిన రైతుకోసం కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. మేడికొండూరులో ఎడ్లబండ్ల ప్రదర్శనను పోలీసుుల అడ్డుకోవడంతో తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజధాని అమరావతిని నాశనం చేశారంటూ మహిళా రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రత్తిపాడులో డప్పుల ర్యాలీను పోలీసులు అడ్డుకున్నారు. కేవలం పాదయాత్ర మాత్రమే నిర్వహించాలని..మైకులు, డప్పులకు అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా.. తుళ్లూరు గ్రామానికి చెందిన రాజధాని మహిళా రైతు మల్లేశ్వరి మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు కంట రక్తం కారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.