TDP protest program against ganja: రాష్ట్రంలో యువత జీవితాలను గంజాయి బారి నుండి రక్షించాలని కోరుతూ.. నేడు గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో టీడీపీ నేతలు కలిసి ఆందోళన చేపట్టారు. గంజాయి అమ్మకం పైన ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని డిమాండ్ చేశారు. 'గంజాయి వద్దు - ఉద్యోగం ముద్దు' అంటూ నినాదాలు చేశారు గంజాయి వినియోగానికి వ్యతిరేకంగా టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి స్థానిక లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వరకు యూత్, టీడీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులు గంజారహిత రాష్ట్రం కావాలంటూ నినాదాలు చేశారు.
సీఎం పోవాలి: రాష్ట్రంలో విచ్చలవిడిగా లభ్యం అవుతున్న గంజాయిని పూర్తిగా నిషేధించాలంటే.. మాదకద్రవ్యాల విక్రయాలను ప్రోత్సహిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన పోవాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర పేర్కొన్నారు. యువత మేల్కొని రాష్ట్రంలో ఎక్కడ మాదక ద్రవ్యాలు లభించినా వెంటనే సామాజిక మధ్యమాల ద్వారా వాటిని అరికట్టే విధానంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను చాటుకోవాలని సూచించారు.
చోద్యం చూస్తున్న సర్కార్: అన్నపూర్ణగా పేరున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి దక్కిందని గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ నజీర్ అహ్మద్ ఆరోపించారు. దేశం మొత్తం మీద 750 టన్నుల గంజాయి పట్టుబడితే మన రాష్ట్రంలోని 20% గంజాయి విక్రయిస్తు పట్టుబడినట్లు గణాంకాలు వెల్లడవుతున్నాయి. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని దుయ్యబట్టారు.