TDP Politburo Member Nimmala Ramanaidu : టీడీపీ అందించిన పథకాలకు పేర్లు మార్చి విడతల వారిగా.. బటన్లు నొక్కడం ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అలవాటుగా మారిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. చంద్రన్న పాలనలో ఒక్కో విద్యార్థి 19 వేల 500 రూపాయలు వసతి దీవెనలో భాగంగా లబ్ధి పొందగా.. జగన్ ప్రభుత్వంలో కేవలం 15 వేల రూపాయలే చెల్లిస్తున్నారని విమర్శించారు. 4 వేల 923 మంది విద్యార్థులను చంద్రన్న విదేశి విద్యకు పంపిస్తే.. జగన్ రెడ్డి పంపించింది కేవలం 213 మంది విద్యార్థులనే అని మండిపడ్డారు. చివరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కూడా ఎగనామం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందివ్వగా.. దానిని 10 లక్షలకు కుదించారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ పాలన ఉన్నప్పుడు నాణ్యమైన విద్యలో.. రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందని అన్నారు. జగన్ పాలనలో మూడో స్థానం నుంచి 19 వ స్థానానికి పడిపోయిందన్నారు. జీవో 77తో నాన్ కన్వీనర్ కోటాలో చేరిన పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎగ్గొట్టారని నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఈ పథకాల నిలిపివేతతో పేద విద్యార్థుల ఉన్నత చదువుల కలను సీఎం చెరిపి వేశారని విమర్శించారు.