TDP Parliamentary Party Meeting Under Chandrababu: కోర్టు కేసుల నుంచి వెసులుబాటు లభించడం.. కంటికి శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకోవడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇక తన రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు, వ్యవసాయ సంక్షోభాన్ని పార్లమెంట్ సమావేశాల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అజెండాగా రేపు మధ్యాహ్నం ఆయన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. డిసెంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఉండవల్లిలోని తన నివాసంలో జరిగే ఈ భేటీలో పార్లమెంట్‌లో గళమెత్తేందుకు దాదాపు 13 అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
రాష్ట్రంలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పెద్ద ఎత్తున ఓట్ల అక్రమాలకు తెరలేపిందనే అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంపీలు, ముఖ్యనేతలు సమన్వయం చేసుకునేలా ప్రణాళిక రూపొందించారు. వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాల వల్ల ఏపీలో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోవడం.. మహిళలకు భద్రత లేకపోవడం, విభజన హామీలు అమలు కాకపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఎంపీలు పార్లమెంట్‌లో గళమెత్తేలా చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
దిల్లీలో చంద్రబాబుకు ఘన స్వాగతం - డిసెంబర్ మొదటివారం నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయడంతో పాటు రాష్ట్రంలో ధరల స్థిరీకరణ, కేంద్ర ప్రాయోజిత పథకాల సక్రమ అమలు వంటి అంశాలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లేలా ఎంపీలకు చంద్రబాబు సూచనలు చేయనున్నారు. ఈనెల 2వ తేదీన జరిగే అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు, లోకేశ్‌లపై అక్రమ కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందనే అంశాన్ని వివిధ పార్టీల దృష్టికి తీసుకెళ్లాలని తెలుగుదేశం నేతలు యోచిస్తున్నారు.