ఇసుక అక్రమ రవాణాపై నారా లోకేశ్ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించిన ఆయన లక్ష రూపాయిల ఆర్థిక సాయం చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక దోపిడి జరిగిందని అంటున్న ముఖ్యమంత్రి... తమ విధానంతో లారీ ఇసుక 70 వేల రూపాయలు చేశారని ఎద్దేవా చేశారు. ఇది వైకాపా ప్రభుత్వం అవినీతి పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా ట్రాక్టర్ ఇసుక రూ.4 వేల నుంచి రూ.7వేల వరకు ఉండేదని.... లారీ ఇసుక రూ. 10 వేలకే దొరికేదని వివరించారు.
ఆయన వెంట వచ్చిన నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం ఇసుక దోపిడీ చేసి పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటోందని ఆరోపించారు. ఇసుక లేక, పనుల్లేక ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఎన్నో కుటుంబాలు అనాథలయ్యాయని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.