Nara Lokesh letter to CM Jagan: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఓ లేఖ రాశారు. ఆ లేఖలో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణల గురించి, 'యువగళం' పాదయాత్రలో ఆయన చేసిన ఆరోపణల గురించి, పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో జరిగిన ల్యాండ్ మాఫియాకు సంబంధించిన వివరాలతోపాటు పలు కీలక విషయాలను పేర్కొన్నారు. అంతేకాకుండా, దమ్ముంటే ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం.. సీఐడీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలంటూ నారా లోకేశ్ సవాల్ చేశారు. యువగళం పాదయాత్ర మొదలైన రోజు నుంచి ఈనాటిదాకా తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని.. ల్యాండ్ మాఫియాపై తెలుగుదేశం పార్టీ నిరంతరంగా పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన గుర్తు చేశారు.
ఆ లేఖలో నారా లోకేశ్ ఏం రాశారంటే: ''ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నిరంతరంగా తన స్వరాన్ని పెంచుతూనే ఉందని మీకు తెలుసు. ల్యాండ్ మాఫియా పేరుతో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న భూమిని కూడా వదలడం లేదు. ఈ ల్యాండ్ మాఫియాపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా భూ ఆక్రమణలకు సహకరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే ఆక్రమణకు గురైన భూముల్లో ఒక్క పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే దాదాపు 601.37 ఎకరాల భూమిని ల్యాండ్ మాఫియా దోచుకున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ స్థాయిలో ప్రభుత్వంలోని కొందరు పెద్ద నాయకుల అండదండలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములు ఏ స్థాయిలో ఆక్రమణలకు గురవుతున్నాయో ఊహించుకోవచ్చు. టీడీపీ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన తర్వాత.. అప్పటి జిల్లా మేజిస్ట్రేట్, చిత్తూరు కలెక్టర్ పీలేరులోని డీకేటీ భూములు, ప్రభుత్వ భూముల కబ్జాపై 2021లో విచారణ జరిపించారు. ఆ నివేదిక ప్రకారం.. మొత్తం 601.37 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు మదనపల్లి సబ్ కలెక్టర్ సవివర నివేదికను సమర్పించారు. అంతేకాదు, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని సబ్ కలెక్టర్ తన నివేదికలో సిఫార్సు కూడా చేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులు మాఫియా పట్ల ఉదాసీనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పై సూచనలో ఉదహరించినట్లుగా, పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో భూ కబ్జాకు పాల్పడిన ల్యాండ్ మాఫియా ఎలిమెంట్స్ మరియు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు భూ మాఫియాతో ప్రమేయం ఉన్నందుకే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. పీలేరులోని భూ కుంభకోణంపై సీఐడీ లేదా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ.. వైఎస్సార్సీపీకి చెందిన పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి శాసనసభలో కోరారు'' అని నారా లోకేశ్ పేర్కొన్నారు.