TDP Nara Lokesh About Schools Situation in Andhra Pradesh: వైసీపీ సర్కారు పాపాలు పాఠశాల విద్యార్థుల పాలిట శాపాలుగా మారాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో గంజాయి, మద్యం, అసాంఘిక కార్యకలాపాలతో విద్యార్థి దశలోనే పిల్లల బంగారు భవిష్యత్తు నాశనమవుతోందని అన్నారు. ఈ మేరకు మహమ్మారిపై యుద్ధం చేద్దామని, ప్రజలారా కలిసి రావాలని పిలుపునిస్తూ ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.
చిత్తూరు జిల్లాలో స్కూలుకి వెళ్లిన అమ్మాయిని వైసీపీ ముఠా గంజాయికి బానిసని చేశారని లోకేశ్ అన్నారు. గంజాయికి అడిక్ట్ అయిన బాలికపై లైంగిక దాడులకి పాల్పడ్డారని, తన కుమార్తెను రక్షించుకోలేక ఆ తల్లి అనుభవించిన నరకం తన కళ్ల ముందు ఇంకా కదలాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అమ్మాయిని డీ అడిక్షన్ సెంటర్‌కి పంపామని వెల్లడించారు. వైసీపీ పాలనలో బడిలోకి, గుడిలోకి గంజాయి వచ్చేసిందని ధ్వజమెత్తారు. విద్యార్థులు మద్యం మత్తులో బడికొస్తున్నారన్న లోకేశ్, నియంత్రించాల్సిన సర్కారే ప్రోత్సహిస్తోందని తాజా సంఘటనలు నిరూపిస్తున్నాయన్నారు.
సీఎం జగన్ ఇంటి ఎదురుగా గంజాయికి బానిసైన పిల్లాడి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తే, ఆమెని పోలీసులు బెదిరించి నోరు మూయించారని పేర్కొన్నారు. జగన్ ఇంటికి సమీపంలో డ్రగ్స్ మత్తులో గ్యాంగ్ రేప్ జరిగితే నేటికీ నిందితుడిని పట్టుకోలేదని మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటికి దగ్గరలో మద్యం మత్తులో ఉన్మాది అంధురాలిని హత్యచేస్తే చర్యల్లేవని ధ్వజమెత్తారు. విచ్చలవిడి గంజాయి, డ్రగ్స్ , మద్యం కారణంగా చోటుచేసుకుంటున్న విషాద ఘటనలు చూసి ఆవేదనతో కట్టడి చేయాలని ప్రభుత్వాన్ని కోరానని, లేఖలు రాశానని తెలిపారు.
గంజాయి గుప్పుమంటున్నా జగన్ సర్కారు పట్టించుకోవడం లేదు: లోకేశ్