అక్రమ కేసుల పెట్టేందుకే..144 సెక్షన్ : కనకమేడల తెదేపా 'చలో ఆత్మకూరు'పై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆత్మకూరు గ్రామాన్ని వదిలివెళ్లిన వారిపై పోలీసులు ఆరా తీశారు. గ్రామం నుంచి 70 కుటుంబాలు వదిలి వెళ్లినట్లు నిర్ధరించుకున్నారు. వారిలో 14 కుటుంబాలను పోలీసులు తిరిగి తీసుకొచ్చారు. మిగిలిన వారినీ త్వరలోనే గ్రామానికి తీసుకొస్తామని చెప్పారు.
144 సెక్షన్‌పై కనకమేడల ప్రశ్నలు
పోలీసుల చర్యపై తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ స్పందించారు. కొన్ని కుటుంబాలను ఆత్మకూరుకు తిరిగి తీసుకెళ్లామని పోలీసులే చెబుతున్నారన్న కనకమేడల... బాధితులు ఊరు వదిలేసి వెళ్లినట్లు పోలీసులు ఒప్పుకున్నారన్నారు. ఎవరి వల్ల ఊరు వదలారో తేల్చాలని.. అలాంటివారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయించడం కోసమే ఆత్మకూరులో 144 సెక్షన్ పెట్టారని కనకమేడల ఆరోపించారు. బాధితులకు రక్షణ కల్పించి అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలా జరగకపోతే న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. మంగళవారం లోగా పోలీసులు తమ బాధ్యత నిర్వర్తించకుంటే తెదేపా ఆ బాధ్యత తీసుకుంటుందన్నారు.
ఇదీ చదవండి:
'పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి'