ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ విభజన హామీలపై ఏం చెప్పారు.. ఏం జరుగుతోంది..!: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ - AP Latest News

TDP MP Galla Jayadev: ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల అమలుకు విభజన చట్టంలో విధించిన పదేళ్ల గడువు పూర్తికాబోతోందని.. ఇప్పటికైనా ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి వాటిని నెరవేర్చడానికి చర్యలు తీసుకోవాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ డిమాండ్‌ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని 2014 మార్చి 1న అప్పటి కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కోరారు. ప్రస్తుత బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను పూర్తి నిరాశకు గురిచేశాయన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందైనా తప్పులను సరిదిద్దుకొని న్యాయం చేయాలన్నారు. కేంద్ర బడ్జెట్‌పై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో జయదేవ్‌ మాట్లాడారు.

TDP MP Galla Jayadev
TDP MP Galla Jayadev

By

Published : Feb 10, 2023, 10:23 AM IST

TDP MP Galla Jayadev: ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మరోసారి నిరుత్సాహపరిచారు. నేను మా రాష్ట్ర సమస్యల గురించి ఇక్కడ తొమ్మిదేళ్లుగా మాట్లాడుతున్నాను. విభజన చట్టంలో చెప్పిన గడువు ముంచుకొస్తున్నా ఇప్పటి వరకూ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో ఏటా చెప్పిందే చెప్పాల్సి వస్తోంది. రాష్ట్రానికి 2014 నుంచి శూన్య వాగ్దానాలు, శుష్క హస్తాలే మిగులుతున్నాయి. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి కర్ణాటకలోని జాతీయ ప్రాజెక్టు అయిన అప్పర్‌భద్రకు రూ.5,300 కోట్లు కేటాయించి మా రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి ఏమీ ఇవ్వలేదు. ఇప్పటికైనా దానికి సంబంధించిన రూ.55,657 కోట్ల రెండో సవరించిన అంచనా వ్యయానికి ఆమోదముద్ర వేసి, నిధులు విడుదల చేయాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దానిపై ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.

ప్రత్యేకహోదా ఎవరికీ లేదన్నారు.. మరి ఇదేంటి?

14వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా కల్పించడం లేదని.. ఇకపై ఏ రాష్ట్రానికీ ప్రత్యేక పన్ను రాయితీలు ఉండవని కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పింది. 2022-23 బడ్జెట్‌లో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు రూ.3,631 కోట్ల ఐజీఎస్‌టీని పారిశ్రామిక అభివృద్ధి ప్రోత్సాహకం కింద తిరిగి చెల్లించింది. కొత్త బడ్జెట్‌లోనూ ఇందుకోసం రూ.1,814 కోట్లు కేటాయించింది. దీన్ని బట్టి ప్రత్యేక హోదా అమలవుతున్నట్లు స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించి ఉంటే ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ కూడా లబ్ధి పొందేది. ప్రస్తుతం రాజధాని కూడా లేని కొత్త రాష్ట్రం విభజన సమయంలో ఎన్నో సంస్థలను తెలంగాణకు వదిలేయాల్సి వచ్చింది. కానీ ఇప్పటికీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదు.

13వ షెడ్యూల్‌లో చెప్పినవన్నీ నెరవేర్చాలి

ఆర్థిక మంత్రి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ బడ్జెట్‌ను రూ.910 కోట్ల నుంచి రూ.683 కోట్లకు తగ్గించారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 93 ప్రకారం 13వ షెడ్యూల్‌లో చెప్పిన సంస్థలను పదేళ్లలోపు రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. 10వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నా.. 13వ షెడ్యూల్‌లో చెప్పిన 17 అంశాలను పూర్తిగా నెరవేర్చలేదు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులంతా 2014 నుంచి ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేస్తూనే వస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు ఎంతో దూరం లేవు. భాజపా ఇప్పటికైనా తప్పుదిద్దుకొని 2014 మార్చి 1న కేంద్ర కేబినెట్‌ తీసుకున్న ప్రత్యేక హోదా నిర్ణయాన్ని అమలు చేయడానికి సమయం ఉంది. బిడ్డకు జన్మనిచ్చిన తల్లిని కాపాడతానని 2014 ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇచ్చిన మోదీ.. దాన్ని నెరవేర్చాలని కోరుతున్నా. ప్రధాన మంత్రి, ఆర్థికమంత్రి విభజన చట్టంలోని హామీలకు గౌరవమిచ్చి వాటిని 2024 జూన్‌ 2లోపు అమలు చేసేలా తగిననన్ని నిధులు కేటాయించాలని కోరుతున్నా’ అని గల్లా జయదేవ్‌ పేర్కొన్నారు.

రైల్వేజోన్‌పై ప్రకటనేది?

రాష్ట్రంలో కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు గురించి స్పష్టమైన ప్రకటన చేయలేదు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హామీని అమలు చేస్తామని ఇది వరకు పలువురు మంత్రులు చాలాసార్లు చెప్పినా ఇంత వరకూ సాకారం కాలేదు. రైల్వేజోన్‌కు రూ.10 కోట్లు కేటాయించినప్పటికీ అది ఎప్పటి నుంచి పని ప్రారంభిస్తుందో చెప్పలేదు. బడ్జెట్‌ తర్వాత నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రైల్వే మంత్రి కూడా దానిపై స్పష్టత ఇవ్వలేదు.

* 2022-23లో బెంగళూరు మెట్రోకు రూ.14,700 కోట్లు, ఇతర మెట్రోలకు రూ.19 వేల కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి.. విభజన చట్టంలో చెప్పిన విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైళ్ల గురించి కనీసం ప్రస్తావించలేదు. 2014 నుంచి ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టులకు బడ్జెట్‌లో చోటే దక్కలేదు.

ప్రత్యేక హోదాపై మీరు 'ఏం' చెప్పారు 'ఏం' చేస్తున్నారు.. గల్లా జయదేవ్‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details