గత 16నెలల్లో వైకాపా ప్రభుత్వం బీసీలకు ఒక్క పథకం అమలు చేయలేదని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. 139 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పి, మడమ తిప్పారని మండిపడ్డారు. 700లకు పైగా నామినేటెడ్ పదవులు, లక్షల్లో వేతనాలు వచ్చే వాటిని సొంత సామాజిక వర్గానికి కేటాయించుకున్నారని ధ్వజమెత్తారు.
కార్పొరేషన్లకు ఛైర్మన్లు అంటూ బీసీలను వంచించేందుకు జగన్ సమాయత్తమయ్యారని దుయ్యబట్టారు. 50 శాతం జనాభా వున్న బీసీలకు చిన్నాచితకా పదవులు ఇస్తున్నారన్నారు. తెదేపా హయాంలో బీసీ సంక్షేమం జరిగితే జగన్ రాకతో బీసీలకు సంక్షోభం ఏర్పడిందని విమర్శించారు.