TDP leaders protest at secretariat: తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేశ్ సభలకు వస్తున్న ప్రజా స్పందన చూసి ఓర్వలేకే జీవో నెంబర్ 1 తెచ్చారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రతిపక్ష నేతల గృహ నిర్భందాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.. వారిని తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి, జగన్ పాదయాత్రలు చేసిన సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం సహకరించిన తీరు ఈ సైకో ముఖ్యమంత్రి తెలుసుకోవాలని హితవుపలికారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా.. ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించే వాళ్ల గొంతు నొక్కుతోందన్నారు. జీవో నెంబర్ 1 తెచ్చి పార్టీల గొంతు నొక్కుతోందన్నారు. జీవో నెంబర్ 1ను రద్దు చేయాలి.. దీనిపై సభలో చర్చ జరపాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌చేశారు. జీవో నెంబర్ 1 రద్దు డిమాండ్ చేస్తూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద తెలుగుదేశం శాసనసభాపక్షం నిరసన చేపట్టింది. ఏ1 తెచ్చిన జీవో నెంబర్ 1 రాజ్యాంగ వ్యతిరేకం అంటూ నేతలు ప్లకార్డుల ప్రదర్శించారు.
ఖైదీ నెంబర్ 6093 తెచ్చిన జీవో నెంబర్ 1 రద్దు చేయాలని నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యంపై గొడ్డలి పెట్టు జీవో నెంబర్ 1 అనే బ్యానర్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి కాలినడకన వెళ్లారు. బ్రిటీష్ కాలం నాటి చట్టం జగన్ నియంతృత్వానికి నిదర్శనం అని మండిపడ్డారు. ఓటమి భయంతోనే ఏ1 జీఓ నెంబర్ 1 తెచ్చాడంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. జీవో నెంబర్ 1 రాజారెడ్డి రాజ్యాంగంలో తప్ప అంబేద్కర్ రాజ్యాంగంలో లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి జీవో నెంబర్ 1 పెనుముప్పు అంటూ మండిపడ్డారు. ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసేందుకే జీవో తెచ్చారని ఆక్షేపించారు. రోడ్లపై సభలు, సమావేశాలు నిర్వహించకూడదు అనటానికి రోడ్లు జగన్ తాత సొమ్ముతో వేశారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి నిరసనగా కాలినడకన ఛలో అసెంబ్లీ నిర్వహించారు.