Chandrababu guest house attachment: గుంటూరు జిల్లా ఉండవల్లి లోని కృష్ణా కరకట్ట సమీపంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను ప్రభుత్వం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ అధికారాన్ని దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారనీ అభియోగం పై ఆస్తుల జప్తునకు ఆదేశాల్లో పేర్కొంది. సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్లలో మార్పుచేర్పులు చేసి బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్ పొందారని ప్రభుత్వం అభియోగం మోపింది. వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్ తీసుకున్నారని చంద్రబాబుపై అభియోగం మోపిడంపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు.
బుద్దా వెంకన్న: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అద్దెకు ఉంటున్న ఇంటిని అటాచ్ చేసి, చంద్రబాబు ఇంటినే అటాచ్ చేసినట్టుగా వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. అటాచ్ చేశామని చెప్పిన గెస్ట్ హౌస్ లింగమనేని పేరుతో ఉందని స్పష్టంచేశారు. గిఫ్టుగా వచ్చిన ఇంటిలోనే జగన్ ఉంటున్నారని బుద్దా ఆరోపించారు. జగనుకు ఒక్కో ఊళ్లో ఒక్కో ప్యాలెస్ ఉంటుందని మండిపడ్డారు. చంద్రబాబు అద్దెకు ఉంటున్న ఇంటికి నోటీసులిచ్చి ఆనందం పొందుతున్నారని ఆక్షేపించారు. సీఐడీ జగన్ ఎవరికి నోటీసులు ఇవ్వమంటే, వారికి నోటీసులిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బోండా ఉమ:కోర్టులో కొట్టేసిన అంశాలపై మళ్లీ కొత్త చట్టాలతో అధికారులు తప్పుడు కేసులు పెడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ ధ్వజమెత్తారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో చంద్రబాబు, నారాయణ ముద్దాయిలు ఎలా అయ్యారని ప్రశ్నించారు. గతంలోనే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరింగిందని చేసిన ఆరోపణలను కోర్టులు కొట్టేశాయని గుర్తుచేశారు. ఇంటికెళ్లే ముందు తప్పుడు కేసులు పెట్టడం వెనుకున్న మర్మమేమిటని నిలదీశారు. చిన్న తప్పు జరిగితేనో దొరికితేనో జగన్ నాలుగున్నరేళ్లు ఆగుతారా అని దుయ్యబట్టారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదు కాబట్టే.. జైలుకు వెళ్లలేదన్నారు. లింగమనేని పేరు మీద ఇల్లు ఉంటే.. చంద్రబాబుపై క్విడ్ ప్రోకో ఆరోపణలు ఏంటని మండిపడ్డారు. జగన్ జారీ చేసిన అటాచ్మెంట్లు.. జీవోలు.. నాలిక గీసుకోవడానికి కూడా పనికి రావని ఎద్దేవా చేశారు.