TDP RELEASED BOOK ON YS VIVEKA MURDER CASE : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వేళ్లన్నీ జగన్ రెడ్డి - భారతీ రెడ్డి కుటుంబం వైపే చూపిస్తున్నాయని ఆరోపిస్తూ.. ఆయన హత్యకు సంబంధించిన "జగనాసుర రక్త చరిత్ర" పేరిట ఓ పుస్తకాన్ని తెలుగుదేశం నాయకులు విడుదల చేశారు. జగన్ రెడ్డి నరహంతక పాలనకు చరమ గీతం పాడుదాం- ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం నినాదంతో గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనంద్ బాబు, బొండా ఉమా తదితరులు కలిసి పుస్తకాన్ని విడుదల చేశారు.
బాబాయ్ గొడ్డలి పోటులో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అన్నీ అబ్బాయేనని నేతలు ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ అండ లేకుండా ఇన్ని నేరాలు.. ఘోరాలు సాధ్యం కాదని ధ్వజమెత్తారు. వివేకా హత్య జరిగిన వేకువ జాము 3 గంటల సమయంలో నవీన్ ఫోన్ ద్వారా భారతీ రెడ్డితో, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ ద్వారా జగన్ రెడ్డితో మాట్లాడానని అవినాష్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్ వివరాలను పుస్తకంలో పేర్కొన్నారు. సీబీఐ ఛార్జిషీట్, వివేకా కుమార్తె సునీత అఫిడవిట్స్, వైయస్ కుటుంబసభ్యుల వాంగ్మూలాలు, అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలం, సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ తదితర అంశాలను పుస్తకంలో పొందుపరిచారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో పాత్రధారులెవ్వరు ? సూత్రధారులెవ్వరు అనే వివరాలతో పుస్తకం రూపకల్పన చేశారు.