Book on SC ST Welfare: ‘దళిత ద్రోహి జగన్‌రెడ్డి - దళిత బాంధవుడు, పేదల పెన్నిధి చంద్రన్న’ TDP Released Book: చంద్రబాబు పర్యటనలను వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుండడాన్ని తెలుగుదేశం సీరియస్‌గా తీసుకుంది. ఎస్సీ నియోజకవర్గాల్లో పర్యటనలకు కావాలనే వైసీపీ ఆటంకాలు కలిగిస్తోందని తెలుగుదేశం మండిపడుతున్నారు. టీడీపీ - వైసీపీ హయాంలో జరిగిన ఎస్సీ సంక్షేమాన్ని చర్చనీయాంశం చేయాలని నిర్ణయించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సమావేశమైన ఎస్సీ నేతలు.. జగన్ పాలనలో దళితులకు సంక్షేమ పరంగా జరిగిన అన్యాయంపై ప్రధానంగా చర్చించారు.
పుస్తకం ఆవిష్కరణ: ‘దళిత ద్రోహి జగన్‌రెడ్డి, దళిత బాంధవుడు, పేదల పెన్నిధి చంద్రన్న’ పేరిట పుస్తకాన్ని విడుదల చేశారు. పేదల సంపదను.. సహజ వనరులను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఏ విధంగా దోచుకుంటున్నారనే అంశాన్ని ఎస్సీ సెల్ తరపున ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ మేర నిర్ణయించారు.
డాక్టర్ సుధాకర్ ఎందుకు చనిపోయాడో, పోలీస్‌స్టేషన్లో వరప్రసాద్‌కు శిరోముండనం ఎందుకు జరిగిందో, ఓం ప్రతాప్ అనే దళిత యువకుడ్ని ఎవరు చంపారో.. దళిత ఆడబిడ్డల మానప్రాణాల్ని ఎందుకు బలితీసుకుంటున్నారో సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఏం సాధించారని ముఖ్యమంత్రి జగన్, సజ్జల దళితులతో, దళిత మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని వారు ప్రశ్నించారు.
అబద్దాలు, అసత్యాలతో దళితుల ఓట్లు దండుకున్న జగన్‌మోహన్‌రెడ్డి పతనానికి దళితులే నాంది పలుకుతారని నేతలు ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా టీడీపీ ప్రభుత్వ హయాంలో 4 లక్షల మంది దళిత యువతకు ఉపాధి కల్పించామన్న నేతలు.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వారికి ఏం చేసిందో మంత్రి మేరుగ నాగార్జున సమాధానం చెప్పగలరా అని సవాల్ విసిరారు. తాడేపల్లి ప్యాలెస్‌కు భయపడి దళిత మంత్రులు, వైసీపీ దళిత నేతలు చచ్చిన పాముల్లా ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు మేయర్ స్రవంతిపై వైసీపీ కౌన్సిలర్లు గూండాల్లా ప్రవర్తించడాన్ని వారు ఖండించారు.
పుస్తకంలోనిఅంశాలు: చంద్రన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన 27 దళిత పథకాల్ని రద్దు చేశారని నేతలు రూపొందించిన పుస్తకంలో పేర్కొన్నారు. 33 వేల కోట్ల ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల్ని మళ్లించడాన్ని తప్పుబట్టారు. 12వేల ఎకరాల దళితుల అస్సైన్డ్ భూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 వేల బ్యాక్‌లాగ్ పోస్టుల్ని భర్తీ చేయకపోగా.. ఇన్నోవా కార్ల పథకం రద్దు చేశారని మండిపడ్డారు. నాలుగు ఎస్సీ నియోజకవర్గాల మధ్యనున్న అమరావతిలో దళిత రాజధానిని నీరుగార్చారని దుయ్యబట్టారు. జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మృతుల్లో 12 మంది దళితులే అని పేర్కొన్నారు.
దాడులు - హత్యలు: జగన్ ప్రభుత్వం దళితులపై దాడులు - హత్యలు చేసిందంటూ పలు అంశాలను పుస్తకంలో ప్రస్తావించారు. సీఎం నివాసానికి కూతవేటు దూరంలో దళిత యువతిపై గ్యాంగ్‌రేప్ చేసిన ముఠానాయకుడు వెంకటరెడ్డిని ఇప్పటికీ అరెస్టు చేయలేదని ధ్వజమెత్తారు. దళిత యువకుడు సుబ్రమణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్‌డెలివరీ చేశారని మండిపడ్డారు. మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను వేధించి దాడి చేసి, పిచ్చివాడని ముద్రవేసి చనిపోయేలా చేశారని విమర్శించారు. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో నాగమ్మ అనే మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం ధరలు ప్రశ్నించాడని ఓం ప్రతాప్‌ను హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించారని ఆరోపించారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో దళిత యువతి అనూషను అత్యాచారం చేసి హత్య చేశారని ఆక్షేపించారు. కడప పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చెన్నను కులం పేరుతో వేధించి హతమార్చారన్నారు. మాస్క్ పెట్టుకోలేదని చీరాలలో కిరాణ్‌ను పోలీసులు కొట్టి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పనిచేసుకుంటున్న దోమతోటి విక్రమ్‌ను గురజాలకు పిలిపించి వైసీపీ నేతలు దారుణంగా హత్య చేశారని దుయ్యబట్టారు. రాజమహేంద్రవరంలో 10వ తరగతి దళిత బాలికపై వైసీపీ గూండాలు గ్యాంగ్‌రేప్ చేశారని ఆరోపించారు.
ఇవీ చదవండి: