TDP LEADERS FIRE ON GO : ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణగదొక్కేందుకే జీవో నెం.1 అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. గతంలో ప్రభుత్వ వైఫల్యాలను పత్రికలు, మీడియా బయటపెడుతున్నాయనే కక్షతో జీవో నెం.2430 తెచ్చారని విమర్శించారు. జగన్‌రెడ్డి ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందని.. అందుకే ఈ నిరంకుశ నిర్ణయాలంటూ మండిపడ్డారు.
ప్రజలు, పత్రికలు, ప్రతిపక్షాలు.. ప్రభుత్వాన్ని నిలదీయకూడదనడం ప్రజాస్వామ్యాన్ని హరించడమేనన్నారు. చంద్రబాబునాయుడు సభలకు వస్తున్న ప్రజల ప్రజాదరణ చూసి జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అచ్చెన్న విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలకు నిరసన తెలియజేసే హక్కు లేదా అంటూ ప్రశ్నించారు.
అర్ధరాత్రి ఇచ్చిన జీవో నాలుకు గీసుకోవడానికి కూడా పనికిరాదు: ప్రతిపక్ష పార్టీలు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అవసరమైన భద్రత కల్పించకుండా ప్రజల ప్రాణాలు బలిగొంటున్నది జగన్‌రెడ్డి కాదా అని నిలదీశారు. నాడు జగన్‌రెడ్డి సభలు, పాదయాత్రకు టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే జగన్‌రెడ్డి ఇంట్లో నుంచి కాలు బయటపెట్టేవాడా అంటూ మండిపడ్డారు. అప్రజాస్వామికమైన జీవో నెం.1 ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సభలు, ర్యాలీల నియంత్రణపై అర్ధరాత్రి ఇచ్చిన తుగ్లక్ జీవో నాలుక గీసుకోవటానికి కూడా పనికి రాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఇవాళ సభలు ఎక్కడ పెట్టాలో చెప్తున్నవారు, రేపు ఆ సభల్లో ఏం మాట్లాడాలో కూడా స్క్రిప్ట్ రాసిస్తారా అంటూ మండిపడ్డారు. తామైతే తగ్గేదెలేదనీ, యథావిథిగా సభలు, ర్యాలీలు నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పారు.
సభలు, ర్యాలీలు నియంత్రించాలని చూడటం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనన్నారు. ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పాటైన ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికను అడ్డుకునే చర్యలను న్యాయబద్ధంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. చీకటి జీవో అమలు చేయాలనుకునే అధికారులు నేటి సీఎం తూర్పుగోదావరి పర్యటనను అడ్డుకోవాలన్నారు. ఇవాళ రాజమహేంద్రవరంలో సీఎం రోడ్డు షోకు ఎలా అనుమతులిచ్చారని నిలదీశారు.
జీవోలు కేవలం ప్రతిపక్షాలకేనా.. అధికార పక్షానికి కాదా: సభలు, రోడ్డుషోలపై ఆంక్షలు విధించడం చూస్తే తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంటే జగన్ భయపడుతున్నాడని ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వ కుట్ర ఫలితమే కందుకూరు, గుంటూరు సంఘటనలని ఆరోపించారు. జీవోలు, 30 యాక్ట్లు ప్రతిపక్షానికే వర్తిస్తాయి కానీ.. అధికార పక్షానికి వర్తించవా అని నిలదీశారు.
రోడ్ షో చేయకూడదని ఆంక్షలు విధించిన జగన్.. నేడు రాజమండ్రిలోని మున్సిపల్ స్టేడియం నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు ఎట్లా రోడ్ షో నిర్వహించాడని ప్రశ్నించారు. ప్రజా గొంతుకను అణిచివేయాలనే ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని అరెస్టు చేసినా, ఎంత మందిని జైల్లో పెట్టినా లక్షలాది మందిగా సభలకు వస్తాం, రోడ్డెక్కుతామని నిమ్మల హెచ్చరించారు.