TDP Leaders Reaction on AP Employees Union: ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వని ప్రభుత్వం సలహాదారులకు మాత్రం లక్షల్లో జీతాలు చెల్లిస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. ప్రభుత్వ సలహాదారుల్లో అధిక శాతం మంది జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గమేనని తెలిపారు. బీసీ, ఎస్సీలపై జగన్మోహన్ రెడ్డి కపట ప్రేమ ఏపాటిదో సలహాదారుల జాబితా చూస్తే తేలిపోతుందని ఎద్దేవా చేసారు. పరిశ్రమల శాఖలో ఆరుగురు సలహాదారులు ఉంటే, సీఎం పెట్టుబడుల కోసం దావోస్ కూడా వెళ్లలేదని ఆక్షేపించారు. సలహాదారులకు వందల కోట్లు ఖర్చు చేసిన జగన్మోహన్ రెడ్డి ఏం ప్రగతి సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు.
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్: జీతాల కోసం ఉద్యోగులు గవర్నర్ వద్దకు వెళ్లాల్సి రావడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులకు మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించి.. ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి అప్పులు పుడితే తప్ప.. ఉద్యోగులకు జీతాలు అందడం లేదన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని పరిశీలించి కేంద్రం తక్షణమే రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించాలని విజ్ఞప్తి చేశారు. జీతాల కోసం ఉద్యోగులు గవర్నర్ని కలవడం దేశంలో ఇదే తొలిసారన్నారు.