TDP Leaders Protest against Chandrababu Arrest: చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును (Chandrababu Naidu Arrest) నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు జంబులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ శ్రేణులు చంద్రబాబు పేరిట ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని వేడుకున్నారు. 101 కొబ్బరికాయలు కొట్టి తమ అధినేతకు మంచి జరగాలని కోరుకున్నారు. నంద్యాలలో గాంధీ విగ్రహానికి టీడీపీ శ్రేణులు వినతిపత్రం సమర్పించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కొట్టాలు గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకు మద్దతుగా విదేశాల్లో సైతం నిరసనలు కొనసాగుతున్నాయి. కెనడాలోని సెంట్రల్ టొరంటోలో నిరసనలలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ విజయవాడలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం యువకులు ఆందోళన చేపట్టారు. ప్రజలు సైకో పాలనతో విసుకు చెందారని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమం తప్పదని ఆయన అన్నారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగటానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ప్రకటించారు. టీడీపీ నేత కేశినేని చిన్ని ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మచిలీపట్నంలో రిలే నిరహార దీక్షల్లో మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో టీడీపీ నాయకుడు తలకిందులుగా కాళ్లు పైకి పెట్టి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కృష్ణాజిల్లా కూచిపూడిలోని దీక్షా శిబిరాన్ని మాజీమంత్రి కొల్లు రవీంద్ర సందర్శించి సంఘీభావం తెలిపారు. చంద్రబాబుకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని.. మళ్లీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుతూ పమిడిముక్కల నుంచి వీరంకి వరకు మహిళలు అఖండ దీపాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో టీడీపీ, జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ వీధుల్లో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.
TDP Leaders and Activists Protests: పట్టు వదలని టీడీపీ నేతలు.. శిబిరాల్లోనే వినాయకుడి పూజలు