దేశ రాజకీయ చరిత్రలో వర్చువల్‌గా ఒక రాజకీయ సమావేశం నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీనేనని ముఖ్యనేతలు తెలిపారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు ఎండగట్టడమే ప్రధాన అజెండాగా మహానాడులో తీర్మానాలు ఉంటాయని వారు వెల్లడించారు.
ప్రధాన సమస్యలు చర్చిస్తాం
రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై మహానాడు చర్చిస్తుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వెల్లడించారు. అన్ని రంగాలను వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించిందన్న ఆయన.. ఏడాది పాలనలో అభివృద్ధి సున్నా అని విమర్శించారు. ఏ రంగం అభివృద్ధిపైనా దృష్టి సారించకపోగా... ఉన్న పథకాలకు కోత పెట్టారని మండిపడ్డారు.
నా ఇష్టం నా రాజ్యం అన్నట్లుగా జగన్ వ్యవహారం ఉంది తప్ప రాజ్యాంగ పరంగా ఎన్నికైన ప్రభుత్వంలా లేదని యనమల విమర్శించారు. అన్ని రాజ్యాంగ వ్యవస్థలపైనా ఎదురుదాడి చేస్తున్నారన్న ఆయన.. పార్లమెంటరీ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.