పుట్టని బిడ్డకు పెళ్ళి చూపులు అన్నట్లుగా అమరావతిలో లేని, వేయని రింగ్ రోడ్డుపై వైసీపీ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తోందని తెలుగుదేశం శాసనసభపక్షం ధ్వజమెత్తింది. 1980నుంచీ భూములు ఉన్న లింగమనేని సంస్థకు, రాష్ట్ర విభజనకు ముందు అమరావతికి 30కిలోమీటర్ల దూరంలో కేవలం 9ఎకరాల భూమి కొనుగోలు నిర్ణయం తీసుకున్నహెరిటేజ్ సంస్థకు లాభం చేకూర్చేందుకు భూసేకరణ కూడా చేయటని రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారన్నది అర్థరహితమని మండిపడింది. మంత్రిగా తన శాఖకు ఏమాత్రం సంబంధం లేని కేసులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేరును చేర్చటాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన పార్టీ ఎమ్మెల్యేలు-ఎమ్మెల్సీలు, పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మాక్ అసెంబ్లీ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు - వాస్తవాలు అనే అంశంపై చర్చ చేపట్టారు. అన్ని నగరాలను అమరావతి రాజధానికి అందుబాటులో ఉంచే లక్ష్యంతో 27రోడ్ల అనుసంధానం ప్రక్రియ కోసం చేపట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు ఆటంకాలు లేని రవాణా వ్యవస్థ కోసం ఏర్పాటు చేసిందేనని శాసనసభాపక్షం స్పష్టం చేసింది. పార్టీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడించారు. లేని రింగ్ రోడ్డుపై ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేయటమే తడవుగా సీఐడీ చంద్రబాబు, లోకేశ్, నారాయణ, హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్, లింగమనేని సంస్థలపై అక్రమకేసులు పెట్టారని మండిపడ్డారు.
Nara Bhuvaneshwari Speech : అరెస్టు చేసి జైలులో పెట్టాక విచారణా..? చేయి చేయి కలిపి చంద్రబాబుకు అండగా నిలుద్దాం : భువనేశ్వరి
రాష్ట్ర విభజనకు ముందే భూమి కొనుగోలు చేసిన హెరిటేజ్సంస్థకి ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా లబ్ది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఒకవేళ భూమి విలువ పెరిగినా ఆ లాభం సంస్థ వాటాదారులకు చెందుతుందని అనురాధ గుర్తు చేశారు. 8ఎకరాల భూమి విలువ రూ కోటి రూపాయలకు పెరిగినా., దీని కోసమే మాస్టర్ ప్లాన్, అలైన్మెంట్ మార్చారని ప్రజలను నమ్మించే ప్రయత్నం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. 1980 నుంచి భూములు ఉన్న లింగమనేని సంస్థకు ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల 14ఎకరాలు కోల్పోతుందని కోర్టుకు ఆఫడివిట్ ఇచ్చిందని తెలిపారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల లబ్ది చేకూరితే నాటి సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ పై కేసు ఎందుకు పెట్టలేదని అనురాధ నిలదీశారు.