TDP Leaders on YSRCP: తన పరిపాలన రథం తిరోగమనంలో పయనిస్తోందన్న అక్కసుతోనే ముఖ్యమంత్రి తన పార్టీ నేతలను రెచ్చగొట్టి వారితో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను అనరాని మాటలు అనిపించి ఆయన్ను కించపరిచారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని అర్థమయ్యే.. ముఖ్యమంత్రి, మంత్రులు నోళ్లకు పని చెబుతున్నారని ధ్వజమెత్తారు. దళితులకు జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం ఏం ఒరగబెట్టిందని వర్ల రామయ్య ప్రశ్నించారు.
రజనీకాంత్‌పై వైసీపీ వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయం: తెలుగుదేశం, జనసేన పొత్తులు ఇంకా ఖరారు కాలేదని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ తెలిపారు. పొత్తులు ఖరారు కాకముందే వైసీపీ నేతలకు ఎందుకంత ఉలుకని ప్రశ్నించారు. చంద్రబాబు-పవన్ భేటీ జరిగితేనే వైసీపీ భయపడిపోతోందని ఎద్దేవా చేశారు. తలైవా రజనీకాంత్‌పై వైసీపీ వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయమని మండిపడ్డారు. రజనీకాంత్‌కు టీ కప్పులు అందించిన చరిత్రను కొడాలి నాని మరిచినట్టున్నారని విమర్శించారు.
అందులో తప్పేముంది: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైసీపీ నేతలు విమర్శలకు దిగటంపై టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఎన్టీఆర్, చంద్రబాబుని రజనీకాంత్ ప్రశంసించటంలో తప్పేం ఉందన్నారు. కానీ వైసీపీ చిల్లర బ్యాచ్ ఆయనపై విమర్శలు చేయటం వల్ల ఏపీ పరువు పోయిందని అభిప్రాయపడ్డారు.