TDP Leaders Fires on Police:రాష్ట్రంలో పోలీసుల వ్యవహారశైలి చాలా పక్షపాతంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. పుంగనూరు ఘటనను సాకుగా తీసుకుని టీడీపీ నాయకులను వేధించడమే పోలీసులు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎఫ్ఐఆర్లు రాసేది వీరే, కేసు రిజిస్టర్ చేసేది వీరే, ముద్దాయిలను నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్టు చేసేది వీరేనని దుయ్యబట్టారు. శిక్షలు కూడా తమరే వేస్తే ఓ పనైపోతుంది కదా అని వర్ల ఎద్దేవా చేశారు.
ముద్దాయిలు టీడీపీ వారైతే వారి పట్ల పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు చేస్తున్న టేబుల్ ఇన్వెస్ట్‌గేషన్ మానాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం నాయకులకు బెయిల్ రాకూడదు, రిమాండుకు వెళ్లి తీరాలనే దృష్టితో పోలీసులు ప్రతిదానికి హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.
దిష్టిబొమ్మ తగలబెడితే.. హత్యాయత్నం కేసు పెడతారా..: వెంకటగిరిలో టీడీపీ నాయకులు కేవలం దిష్టిబొమ్మ తగలబెడితే హత్యాయత్నం కింద కేసు రిజిష్టర్ చేస్తారా అని నిలదీశారు. ఒంటిమీద పెట్రోల్ పడ్డట్టు ఆధారాలు లేకపోయినా.. పెట్రోల్ పోసి నిప్పంటించబోయారని తప్పుడు కేసు పెడతారా.. అసలు అక్కడ మనిషే లేరు అని వర్ల రామయ్య మండిపడ్డారు. వెంకటగిరి పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసిన కేసును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మహిళా కానిస్టేబుల్‌పై వైసీపీ నాయకులు దాడి చేస్తే ఏం చేస్తున్నారు: అనంతపురం సెబ్ పోలీసు స్టేషన్లో మహిళా కానిస్టేబుల్‌ను వైసీపీ నాయకులు చున్నీ లాగి అసభ్యకరంగా ప్రవర్తిస్తే పోలీస్ అసోసియేషన్ ఏం చేస్తోందన్నారు. వైసీపీ కార్యకర్తలు చూపించిన ఇళ్లల్లో రైడ్ చేసి ఆడ, మగ తేడా లేకుండా టీడీపీ వాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తే భవిష్యత్తులో పుట్టగతులుండవని హెచ్చరించారు. పుంగనూరు ఘటనను చూపించి తెలుగుదేశం కార్యకర్తలను సాధించాలనుకుంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.