మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజే ఈ ఘటన జరగడం జరగడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. దిశ చట్టం పేరుతో... ప్రజలను ప్రభుత్వం మభ్యపెడుతోందని ఆరోపించారు. రమ్య కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి ఘటనను మరవకముందే రమ్య హత్య ఘటన జరగడం బాధాకరమని తెదేపా నేత నసీర్ అహ్మద్ ఆవేదన చెందారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని విమర్శించారు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం వాస్తవానికి దూరంగా ఉందని వ్యాఖ్యానించారు. రమ్య మృతికి కారణమైన వారిని గుర్తించాలంటూ గుంటూరు జీజీహెచ్ ఎదుట తెలుగు మహిళ విభాగం నేతలు డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తాడేపల్లి ఘటనను గుర్తు చేసిన తెలుగు మహిళలు.. దిశ చట్టం ఎక్కడ అమలవుతుందో చెప్పాలని ప్రశ్నించారు.