TDP Leaders on Jagan : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చూసి వైసీపీకి వెన్నులో వణుకు మొదలైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. పాదయాత్ర 30 రోజులకు 12 కేసులు పెట్టడం ఏంటని నిలదీశారు. పోలీసులే ఫిర్యాదుదారులు కావడం దేశంలో ఎక్కడా లేదని ఎద్దేవా చేశారు. గన్నవరం, అనపర్తి ఇలా ప్రతి దాంట్లో పోలీసులే పిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఏ అధికారిని లోకేశ్ వదిలిపెట్టరని.. అందరి లెక్కలు సరిచేస్తాడని హెచ్చరించారు. ఇక లోకేశ్‌పై ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోవాలని సవాల్ చేశారు.
రైతుల్ని మరోసారి వంచించి పబ్బం గడుపుకోవడానికే, తెనాలిసభలో జగన్ రెడ్డి అబద్ధాలు, అరుపులు, కేకలతో చిత్రవిచిత్ర విన్యాసాలు చేశాడని తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. అరుపులు, కేకలతో తాను చేయని సాయాన్ని, సంక్షేమాన్ని చేస్తున్నట్టు రైతుల్ని నమ్మించడానికి జగన్ ప్రయత్నించాడని దుయ్యబట్టారు. జగన్ జమానాలో రైతులు సంతోషంగా ఉంటే, వైసీపీ ప్రభుత్వంలో ఆత్మహత్యలు ఎందుకు ఎక్కువయ్యాయని నిలదీశారు. అబద్ధాలు, మోసాలతో రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి నమ్మించి, వచ్చే ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలన్నదే.. జగన్ తాపత్రయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచే టీడీపీ పార్టీ ఉందన్న విషయం ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోవాలని. ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి కోరారు.