ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 17, 2023, 3:41 PM IST

ETV Bharat / state

TDP Leaders: 'మార్గదర్శిపై తప్పుడు కేసులు.. సీఐడీ తీరు హాస్యాస్పదం'

TDP Leaders Comments: ఈనాడు గొంతునొక్కేందుకే వైసీపీ ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని రకాల యంత్రాంగాలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. సీఐడీ తీరు హాస్యాస్పదమని అన్నారు.

TDP Leaders
టీడీపీ నేతలు

TDP Leaders Comments: నిష్పక్షపాత పాత్రికేయ విలువలతో పనిచేస్తున్న ఈనాడు గొంతు నొక్కేందుకే వైసీపీ ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ప్రజాగళాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న అన్ని రకాల యంత్రాంగాలను దుర్వినియోగం చేస్తోంది అని మండిపడ్డారు.

ఏపీ సీఐడీ దిల్లీకి వెళ్లి ప్రెస్ మీట్లు పెట్టే తీరును చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మార్గదర్శిపై తప్పుడు ఆరోపణల చేస్తూ ప్రతీకార చర్యలకు పాల్పడటం దుర్మార్గమని విమర్శించారు. చిట్ ఫండ్ యజమాని తన కమీషన్​ను పెట్టుబడిగా పెట్టుకోవచ్చని 1982 చిట్ ఫండ్ చట్టం చెబుతోందని గుర్తు చేశారు.

బ్యాంకింగేతర సంస్థలు తమకు వచ్చే కమీషన్‌తో వ్యాపారం చేయకూడదు అని సీఐడీ నిరూపించగలదా అని ప్రశ్నించారు. సీఐడీకి బ్యాంకు స్టేట్‌మెంట్ల పరిశీలన, ప్రాథమిక ఎకౌంటింగ్‌ సూత్రాలపై కనీస అవగాహన లేనట్టు కనిపిస్తోందన్నారు. ఏటా మార్చి 31వ తేదీన చెక్కులు , వసూళ్లను నగదు రూపంలో లెక్కిస్తారని చెప్పారు. ఎకౌంటింగ్‌లో క్రెడిట్‌ చేసినప్పుడు బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కనిపిస్తుందన్నారు. ఇది సాధారణ అకౌంటింగ్‌ విధానమన్న ఆయన.. ఈ విషయం సీఐడీకి తెలియకపోవడం హాస్యాస్పదమని యనమల విమర్శించారు.

ప్రభుత్వ తప్పులను రాస్తున్నందుకే మార్గదర్శిపై కేసులు:ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఈనాడు పత్రికలో రాస్తున్నందునే.. అక్కసుతో వారి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో మార్గదర్శిపై తప్పుడు కేసులు పెట్టారని.. మాజీ మంత్రి రాజాం నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ కొండ్రు మురళీమోహన్ విమర్శించారు. మార్గదర్శి ఏ తప్పూ చేయలేదనీ, ఎవరికీ అన్యాయం చేయలేదన్న విషయం ప్రతి ఒక్కరిని తెలుసని ఆయన అన్నారు. దురుద్దేశంతోనే ప్రభుత్వం తప్పుడు కేసులను నమోదు చేసిందని చెప్పారు.

దేశంలో ఉన్న తెలుగువారికి ఆదర్శమైన వ్యక్తి రామోజీరావు గారని కొండ్రు అన్నారు. ఈనాడు పత్రికను ప్రతి ఒక్కరూ నమ్ముతారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం మార్గదర్శిపై ఎప్పుడైతే తప్పుడు కేసులు పెట్టిందో.. అప్పటి నుంచే ప్రభుత్వానికి పతనం మొదలైందని కొండ్రు ఆరోపించారు. ఇప్పటికైనా సీఐడీ చీఫ్ ఒకసారి ఆలోచించి మార్గదర్శిపై పెట్టిన తప్పుడు కేసులను వెనక్కి తీసుకోవాలని కొండ్రు డిమాండ్ చేశారు.

లక్షల మంది ఖాతాదారులు ఉన్నా.. ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని ప్రభుత్వం దురుద్దేశంతోనే తప్పుడు కేసులు నమోదు చేసిందని అన్నారు. తాను కూడా గతంలో మార్గదర్శిలో చిట్ కట్టి తద్వారా లబ్ధి పొందానని కొండ్రు తెలిపారు. మార్గదర్శి మీద ఎన్ని కేసులు పెట్టినా ప్రజలకు ఉన్న నమ్మకం పోదని పేర్కొన్నారు. ఈనాడు పత్రికను ప్రతి ఒక్కరూ నమ్ముతారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుందని.. అవి ఈనాడులో రాస్తే తప్పా అని కొండ్రు ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details