ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టును ఖండించిన తెదేపా నేతలు - ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ వార్తలు

తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేయటాన్ని పలువురు నేతలు ఖండించారు. అధికారం ఉందని ఇటువంటి దారుణాలకు పాల్పడితే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హితువు పలికారు. ధూళిపాళ్లను అరెస్టు చేయటం కక్ష సాధింపు చర్యేనని నేతలంతా ఆరోపించారు.

tdp leaders condemns dhulipalla narendra arrest
ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టును ఖండించిన తెదేపా నేతలు

By

Published : Apr 23, 2021, 2:18 PM IST

  • అమర్​నాథ్ రెడ్డి, మాజీ మంత్రి

సంగం డైరీ ద్వారా పాల రైతులకు అండగా నిలుస్తున్నాడన్న అక్కసుతోనే... ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్టు చేశారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు కక్ష సాధింపు చర్యేనన్న అమరనాథరెడ్డి.. నరేంద్రను ఎందుకు అరెస్ట్ చేశారో రైతులు, ప్రజలందరికీ తెలుసన్నారు. అధికారం ఉందని ఇలాంటి దారుణాలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

  • బండారు సత్యనారాయణ, మాజీ మంత్రి

డీజీపీ గౌతం సవాంగ్ నేతృత్వంలో పోలీసులు వైకాపా యూనిఫాం వేసుకుని.. పని చేస్తున్నారని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి విమర్శించారు. రాక్షస పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి మారారని దుయ్యబట్టారు. నాడు రాజశేఖర్ రెడ్డి అవినీతిని, ఇపుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులను నరేంద్ర ఎండగట్టారనే అక్కసుతోనే.. అక్రమంగా అరెస్టు చేశారని బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు.

  • నక్కా ఆనందబాబు

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టుని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ఖండించారు. ప్రభుత్వ తప్పుల్ని నిలదీస్తున్నందుకే నరేంద్రను అరెస్టు చేశారని ఆరోపించారు. సంగం డెయిరీ 2103లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా మాక్స్ చట్టం పరిధిలోకి వెళ్లిందన్నారు. 8 ఏళ్ల క్రితం నాటి వ్యవహారాలపై ఇప్పుడు కేసు నమోదు చేయటమేంటని ప్రశ్నించారు. సంగం డెయిరీ వల్ల నష్టపోయామని ఎవరైనా ఫిర్యాదు చేశారా ప్రశ్నించారు.. డెయిరీకి పాలుపోసే రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారని.. అలాంటప్పుడు కేసులెందుకు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. అముల్ డెయిరీకి మేలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.

  • గోరంట్ల బుచ్చయ్యచౌదరి

గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే సంఘం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టును మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు ఖండించారు. సంఘం డెయిరీని పాడి రైతులకు తిరుగులేని ఆస్తిగా తీర్చిదిద్దిన ఘనత వారిదని, నరేంద్రపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ కక్షసాధింపులు హద్దు మీరిపోయాయని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కక్షసాధింపులో భాగంగానే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేశారని జీవీ ఆంజనేయులు దుయ్యబట్టారు.

  • ఆలపాటి రాజేంద్రప్రసాద్

ధూళ్లిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఖండించారు. జగన్ రెడ్డి రెండేళ్ల పాలన మూడు కేసులు, ఆరు అరెస్టులుగా ఉందని‌ విమర్శించారు. పాలించడం చేతగాని వాడికి పగ్గాలు అప్పగిస్తే పాలన ఇలానే ఉంటుందని మండిపడ్డారు. సమస్యలను ప్రశ్నించిన ప్రతిసారి ప్రతిపక్ష పార్టీ నాయకులపై అక్రమ అరెస్టులు, కేసులు బనాయిస్తున్నారని దుయ్యబట్టారు. ఒక బందిపోటును అరెస్ట్ చేసినట్లుగా వందల మంది పోలీసులతో నరేంద్రను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • వేగేశ్న నరేంద్రవర్మ, బాపట్ల నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్

అమూల్ కోసమే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారని బాపట్ల నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ ఆరోపించారు. ధూళిపాళ్ల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అముల్ డైరీ కోసం సంగం డైరీని దెబ్బ తీసేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. కుట్రలో భాగంగానే సంగం డైరీలో అవకతవకలు జరిగాయని వంకతో అరెస్టు చేశారన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు వైసిపి ప్రభుత్వ పిరికిపంద చర్య అని విమర్శించారు. సంగం డెయిరీలోని ప్రతి సమస్య హైకోర్టు, సుప్రీంకోర్టులో నడుస్తుందని... అలాంటప్పుడు ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. తక్షణమే నరేంద్రను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details