గురజాల నియోజకవర్గంలో తెదేపా శ్రేణులపై దాడులను నివారించాలని... గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. పల్నాడులో తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తల దాడులు, దౌర్జన్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. గురజాలలో పార్టీ దళిత నేత విక్రమ్ హత్య చేశారని... పలువురి కాళ్లు చేతులు విరగ్గొట్టారన్నారు. పిన్నెల్లి గ్రామంలో తెదేపా కార్యకర్తలపై 4రోజుల నుంచి దాడులు జరుగుతున్నాయన్నారు. దాడులను ఆపాల్సిన మాచవరం ఎస్ఐ లక్ష్మీ నారాయణరెడ్డి వైకాపా కార్యకర్తగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తక్షణమే విక్రమ్ హత్యకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
13 నెలల నుంచి పల్నాడులో తెదేపా నేతలపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు చేసే అక్రమాలు, దాడులకు కొంత మంది పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలని.. దాడులకు సహకరించే పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.