TDP COMMENTS ON MLA QUOTA MLC ELECTIONS : అధికార పార్టీ వైసీపీ నుంచి ఫిరాయింపులు మొదలయ్యాయని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. అందువల్ల అభద్రతా భావనలో జగన్ క్యాంపులు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మీద అసంతృప్తితో ఉన్న 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు చేస్తూనే ఉన్నారని ఆయన తెలిపారు. బాధలో ఉన్నాం అందుకే తమతో పంచుకుంటున్నాం అని తమని సంప్రదించిన ఎమ్మెల్యేలు చెప్తున్నారన్నారు.
"వైసీపీ నుంచి ఫిరాయింపులు మొదలయ్యాయి. 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు. అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నాం.16 మందిలో 3 ప్రాంతాల ఎమ్మెల్యేలు ఉన్నారు. మా ఎమ్మెల్యే భవానితోపాటు మరికొందరిని బెదిరిస్తున్నారు"-గోరంట్ల బుచ్చయ్య, టీడీపీ నేత
తాము ఎవ్వరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదన్న గోరంట్ల.. వారు అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నామన్నారు. ఈ 16మందిలో 3ప్రాంతాల ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. తమ ఎమ్మెల్యే భవానీతో పాటు మరికొందరిని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారికున్న వ్యాపార సంస్థలపై దాడులు చేస్తామని బెదిరించారన్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలోనూ తెలుగుదేశం చరిత్ర సృష్టిస్తుందని ఆ పార్టీ నేత నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీలో అసంతృప్తితో ఉన్న 16మంది ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఝలక్ ఇస్తేనే జగన్ మారతాడనే భావనలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఎద్దేవా చేశారు. అంతర్గత ఓటింగ్‌లో ఎవరు ఎవరికి వేశారో.. తెలిసే అవకాశమే లేదని ఆయన తెలిపారు.