Cm Jagan Delhi Tour : సీఎం జగన్ దిల్లీ పర్యటన వివరాలను బహిర్గతం చేయాలని తెలుగుదేశం శాసనసభ పక్షం నిరసన వ్యక్తం చేసింది. దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఏం సాధించుకుని వచ్చారంటూ.. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. పోలవరానికి ఎన్ని నిధులు తీసుకువచ్చారంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. ప్రత్యేక హోదా తెచ్చారా అంటూ నినాదాలు చేశారు. వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ ఏమైందని నిలదీశారు. అప్పర్ భద్రను నిలువరించారా, విశాఖకు రైల్వేజోన్ తీసుకువచ్చారా అంటూ.. తెలుగుదేశం నేతలు కాలినడకన అసెంబ్లీకి బయల్దేరారు.
బాబాయ్ హత్య కేసులో సీబీఐ అడుగు ముందుకు వేసినప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దిల్లీ గుర్తుకొస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. కేసులు మాఫీ చేయించుకోవాలని సీఎం దిల్లీ వెళ్లారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి 18సార్లు దిల్లీ వెళ్లారని వివరించారు. ఈ 18 సార్లలో 31రోజుల పాటు దిల్లీలో ఉన్నారన్నారు. అన్నిసార్లు దిల్లీ ఎందుకు వెళ్లారో ప్రజలెవ్వరికీ తెలియదని అన్నారు. ఈరోజు శాసనసభలో దిల్లీ పర్యటన వివరాలు చెప్పితీరాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఆదరాబాదరాగా దిల్లీ ఎందుకు వెళ్లారో ముఖ్యమంత్రి ప్రకటించాలని అచ్చెనాయుడు డిమాండ్ చేశారు.
"18 సార్లు దిల్లీ వెళ్లిన.. ఎందుకు వెళ్తున్నారో తెలియదు. ఏ సమస్య ప్రస్తావిస్తారో తెలియదు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. అదివారం కూడా అసెంబ్లీని పెట్టిన బీజీ ముఖ్యమంత్రి.. నిన్న దిల్లీకి అర్జెంటుగా ఎందుకు బయల్దేరి వెళ్లారు. దిల్లీకి వెళ్లి రాష్ట్రానికి ఏం సాధించారు. బాబాయ్ హత్య కేసులో, తనపై ఉన్న కేసులలో సీబీఐ ఒక అడుగు ముందుకు వేస్తే ముఖ్యమంత్రికి దిల్లీ గుర్తుకు వస్తుంది."-అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు