ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP Leaders: నాలుగేళ్లు నిద్రపోయి.. ఎన్నికల ముందు కల్యాణమస్తు అంటూ డ్రామా

TDP Leaders Comments on CM Jagan: ప్రజలను సీఎం జగన్ అబద్దాలతో మోసం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ఎన్నికల ముందు కల్యాణమస్తు అంటూ డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. రియింబర్స్​మెంట్ విషయంలో విద్యార్థులను, తల్లిదండ్రులను జగన్ నిలువునా ముంచారని.. ఉత్తుత్తి బటన్​లు నొక్కుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.

TDP Leaders Comments on CM Jagan
సీఎం జగన్​పై టీడీపీ నేతల కామెంట్స్

By

Published : May 5, 2023, 4:37 PM IST

TDP Leaders Comments on CM Jagan: సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు సేవ చేయకుండా అబద్దాలతో మోసం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన 100 పథకాలు జగన్ ఎగ్గొట్టారని ఎద్దేవా చేసారు. నాలుగేళ్ల పాటు నిద్రపోయి ఎన్నికల ముందు కల్యాణమస్తు అంటూ డ్రామాకు తెరతీశారని ధ్వజమెత్తారు. నాడు లోటు బడ్జెట్​లో సైతం పెళ్లికానుక కింద 307 కోట్లు ఖర్చు చేసిన ఘనత టీడీపీదని గుర్తు చేశారు.

టీడీపీ హయాంలో కేవలం రేషన్ కార్డే ప్రామాణికంగా పెళ్లిపీటల మీదే వధూవరులకు.. పెళ్లికానుక అందజేశామన్నారు. జగన్ రెడ్డి కఠిన నిబంధనలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తున్నారని మండిపడ్డారు. విలీనం పేరుతో 15 వేల పాఠశాలలను మూసేసిన జగన్ 10వ తరగతి పాసైతైనే పెళ్లికానుక ఇస్తామనటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

ఉత్తుత్తి బటన్లు నొక్కుతున్నారా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫీజు రీయింబర్స్​మెంట్ విషయంలో విద్యార్థులను, తల్లిదండ్రులను నిలువునా మోసం చేశారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఖజానాలో నిజంగా డబ్బులు ఉన్నాయా.. లేకుంటే ఉత్తుత్తి బటన్ నొక్కుతున్నారా అనేది అర్థం కావడం లేదని విమర్శించారు.

విద్యార్థులకు సకాలంలో ఫీజు రీయింబర్స్​మెంట్​ పడకపోవడంతో.. విద్యా సంవత్సరం పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని ఇడుపులపాయి ట్రిపుల్ ఐటీలో విద్యా సంవత్సరం పూర్తయిన విద్యార్థులకు టీసీలు, సర్టిఫికెట్లు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

సర్టిఫికెట్లు ఇవ్వాలంటే తమకు చెల్లించాల్సిన ఫీజులు ఇవ్వాలని.. లేదంటే సర్టిఫికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారని ఆయన తెలిపారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఒక్కో విద్యార్థి సుమారు లక్ష రూపాయల వరకు ఫీజు చెల్లించాలని అధికారులు చెప్పడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నారని అన్నారు.

నిజంగా ఖజానాలో డబ్బులు ఉంటే బటన్ నొక్కాలి తప్ప ఇలా ఉత్తుత్తి బటన్​లు నొక్కడం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని తెలిపారు. ఈనెల 10వ తేదీ లోపు ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుంటే 11వ తేదీ టీడీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు అందరూ ఇడుపులపాయకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.

రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలలోని అధ్యాపకులకు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారని.. ఇప్పటికైనా ఆయన పూర్తి స్థాయిలో ఫీజు రీయింర్స్​మెంట్​ చెల్లించి విద్యార్థుల జీవితాలను బాగుచేయాలని కోరారు.

యువతకు ఉద్యోగాలు ఎక్కడ?: సీఎం జగన్ యువత భవిష్యత్తును నాశనం చేశారంటూ నందిగామ ఆర్డీవో కార్యాలయం వద్ద.. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. జాబ్ కావాలంటే.. బాబు రావాలి, సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. జాబ్​లెస్ క్యాలెండర్​తో యువత భవిష్యత్తు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని సౌమ్య విమర్శించారు. యువతకు ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నించారు. నాలుగేళ్లు పూర్తయినా మెగా డీఎస్సీ ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details