TDP Leaders on Chit Funds: చిట్ ఫండ్ కంపెనీలపై కేసులు పెడుతున్న సీఐడీ.. ఆర్థిక శాఖలో నిధుల తరలింపును ఎందుకు పట్టించుకోవట్లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర నిలదీశారు. ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము తరలించిన ఆర్థికశాఖ అధికారులపై సీఐడీ ఎప్పుడు కేసు పెడుతుందని ప్రశ్నించారు. చిట్ ఫండ్ కంపెనీలు ఖాతాదారుల సొమ్ములు తరలించాయనే అనుమానంతో, ఫిర్యాదులు లేకున్నా సీఐడీ కేసులు పెట్టి అరెస్ట్లు చేస్తోందని మండిపడ్డారు.
"చిట్ ఫండ్ కంపెనీలు ఖాతాదారుల సొమ్ములు తరలించాయని తమకున్న అనుమానంతో.. ఫిర్యాదులు లేకున్నా రాష్ట్రంలో CID కేసులు పెట్టి, అరెస్ట్లు చేస్తోంది. మరి ఉద్యోగుల GPF సొమ్ము రూ. 486 కోట్లు వారికి తెలియకుండా వారి ఖాతాల నుంచి మాయం చేశారని ఉద్యోగ సంఘాల నేతలే ఆరోపిస్తున్నారు. ఇది నేరం కాదా? ఉద్యోగుల GPF సొమ్ము తరలించిన ఆర్థికశాఖ అధికారులపై CID ఎప్పుడు కేసు పెడుతుంది?"-ట్విట్టర్లో ధూళిపాళ్ల నరేంద్ర
ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము 486 కోట్ల రూపాయలను వారికి తెలియకుండా వారి ఖాతాల నుంచి మాయం చేశారని ఉద్యోగ సంఘాల నేతలే ఆరోపిస్తున్నారుగా.. మరి దానిని నేరంగా ఎందుకు పరిగణించట్లేదని నిలదీశారు. చిట్ ఫండ్ కంపెనీల విషయంలో అనుమానంపైనే కేసులు పెట్టిన సీఐడీ, ఉద్యోగుల సొమ్ము మాయం అయినట్లు నిర్ధారణ అయినా ఎందుకు కేసులు పెట్టడం లేదో సమాధానం చెప్పాలని ధూళిపాళ్ల డిమాండ్ చేశారు.