Dhulipalla Narendra made serious allegations on jagan: అవినీతికి జగన్మోహన్ రెడ్డి ఐకాన్, బ్రాండ్ అంబాసిడర్ అని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్పుతో జగన్ మైండ్ బ్లాంక్ అయిందన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నుంచి పక్క దారి పట్టించే ప్రయత్నమే ఇవాళ సభలో జరిగిందని దుయ్యబట్టారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన జగన్, మంచి స్క్రిప్ట్ రాసి సినిమా తీస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. పట్టభద్రుల దెబ్బకే దిమ్మ తిరిగిందని, రాష్ట్రంలోని ప్రజలంతా జగన్ను కొడితే పాతాళంలోకి వెళ్లిపోతారని ఆక్షేపించారు.
రాజధాని నిర్మాణం పేరుతో కొత్త కథని తెచ్చారని, ఈ నాలుగేళ్లు ఏం చేశారని నరేంద్ర నిలదీశారు. దర్యాప్తు సంస్థలు ఉండగా సభా సమయాన్ని వృథా చేసేలా సభలో ఈ తరహా చర్చలెందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. సభలో ఇచ్చే ప్రజెంటేషన్ ఏదో అకాల వర్షాల వల్ల రైతులను ఆదుకోవడం విషయంలో ప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుందని హితవు పలికారు. అవినీతి ఆధారాలుంటే దర్యాప్తు సంస్థలకు అప్పగించకుండా సభలో ప్రజెంటేషన్లు ఏంటనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై బురద జల్లడానికే తప్ప ఈ విమర్శల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు టీడీపీపై ఆరోపణలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోపణలను నిరూపించలేకపోయారని విమర్శించారు.