వివేకా హత్య కేసులో సీఎం జగన్పై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసుతో తనకు సంబంధం లేదని చెప్పే ధైర్యం సీఎం జగన్ కు ఉందా అని అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రశ్నించారు. మీడియా సమావేశం నిర్వహించిన ఆయన జగన్పై విమర్శలు చేశారు. వివేకానంద రెడ్డిని గతంలో చంద్రబాబు చంపారని చెప్పారన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక సిబిఐ కేసులు ఉపసంహరించుకున్నారన్నారు. వివేక కూతురు గట్టిగా పోరాడుతుండడం వల్లే ఆ కేసు ముందుకు వెళుతుందని ప్రభాకర్ చౌదరి అన్నారు. గతంలో ప్రతిపక్షాలపై ఎవరైనా అక్రమ కేసులు పెడితే ముఖ్యమంత్రులు వాటి విషయంలో స్పందించేవారు అన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి పరోక్షంగా వాటిని ప్రోత్సహిస్తూ ప్రతిపక్షాలను అణిచివేయాలన్న ధోరణిలో ముందుకు వెళ్తున్నారని ప్రభాకర్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజలను మోసం చేయడమే కాకుండా సొంతచెల్లిని, తల్లిని కూడా మోసం చేసిన మోసగాడని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో జగనాసుర అవినీతి నేరాక్షసుడు చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బీకే పార్థసారథి మాట్లాడుతూ దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్. తండ్రిని అడ్డంపెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకొన్నాడు. రూ.43వేల కోట్లు దోచుకొన్నట్లు ఈ.డీ. గుర్తించి 13కేసులు నమోదు చేసింది వాస్తవమన్నారు. జగన్ బంధువులు, మిత్రులను ఉపయోగించి హత్యలు చేయించి చేతికి మట్టిఅంటుకోకుండా వ్యవహరిస్తాడని ఆరోపించారు. 2019 ఎన్నికల ముందు కోడి కత్తికేసు తనే సృష్టించి సానుభూతి సంపాదించాడని తెలిపారు. ఎన్నికల ముందర నారాసుర చరిత్ర అని వివేకానంద మరణంపై సాక్షిలో ప్రచురించాడని పేర్కొన్నారు.