TDP Leaders Allegations on Jagan About Krishna Delta::సస్యశ్యామలంగా ఉండే కృష్ణా డెల్టా ప్రాంతం వైసీపీ పాలనలో ఎడారిని తలపిస్తోందని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. సాగునీరందక పంటలు ఎండిపోయే పరిస్ధితి నెలకొందన్నారు. అన్నదాతల్ని ఆదుకోలేని ప్రభుత్వం ఉంటే ఎంత.. లేకుంటే ఎంత అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకుంటే నాగలిని శిలువగా మోస్తూ రైతుల పక్షాన పోరాటానికి శ్రీకారం చుట్టి తక్షణమే పదవికి రాజీనామా చేస్తా అన్నారు.
వ్యవసాయానికి నీరే ప్రాణాధారం, అలాంటి నీటిని అందించలేని ప్రభుత్వం ఎందుకని మండిపడ్డారు. కృష్ణా నదీ జలాల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసారు. సాగునీటి కాలువల నిర్వహణ ప్రభుత్వ వైఫల్యంతో రైతులు బలవుతున్నారన్నారు. ప్రభుత్వ చేతకానితనం వల్ల పంట పొలాలకు నీరు అందక రేపల్లె నియోజకవర్గంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపారు. నీళ్లు లేక నిజాపట్నం, రేపల్లె, నగరంపాలెం మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు.
Bode Prasad Allegations on Jagan:వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులను పూర్తిగా విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విమర్శించారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలంలో స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పర్యటించిన ఆయన వ్యవసాయ క్షేత్రంలో సందర్శించారు. రైతులను సమస్యలపై అడగ్గా సాగునీరు అందటం లేదని, విద్యుత్ సరఫరాలో అంతరాయం బాగా ఉందని, ఒక ట్రాన్స్ఫార్మర్పై అధిక లోడు ఏర్పడటంతో బోర్లు పని చేయక ఇబ్బంది పడుతున్నామన్నారు. విద్యుత్ అధికారులు కూడా సకాలంలో స్పందించకపోవడంతో ఒకటి రెండు రోజులు విద్యుత్ సరఫరా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు రైతులు మోటార్ సైకిల్‌తో పంట పొలంలో నడిపి తమ పరిస్థితిని వివరిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోడే మాట్లాడుతూ ఇప్పటివరకు ఎప్పుడు చూడనీ అసమర్ధ ప్రభుత్వ పాలన రాజ్యమేలుతుందన్నారు.