దుగ్గిరాల ఎంపీపీ అభ్యర్థి జబీన్‌కు తక్షణమే బీసీ(ఎ) కుల ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరులో తెలుగుదేశం పార్టీ నేతలు, ముస్లిం సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. గుంటూరు తెదేపా పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుని చెల్లాచెదురు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఒక ముస్లిం మహిళకు రాజకీయాలలో అవకాశం కల్పించకూడదనే దురుద్దేశంతోనే.. దుగ్గిరాల ఎంపీపీ అభ్యర్థి జబీన్‌కు బీసీ కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారని తెదేపా నేత నసీర్ అహహ్మద్ అగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే.. ఆర్కే చెప్పినట్లు ప్రభుత్వ అధికారులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. ముస్లింలకు అండగా ఉంటామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే ముస్తఫా.. నేడు ముస్లింల అణచివేతకు కారణం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జబీన్‌కు బీసీ(ఎ) కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు.
బీసీ కాదన్న కలెక్టర్..
గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తెదేపా ఎంపీపీ అభ్యర్థి జబీన్ బీసీ కాదని జిల్లా పాలనాధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. గతంలో తహశీల్దార్ ఇచ్చిన నివేదికను కలెక్టర్ సమర్థించారు. జబీన్ కుల ధ్రువీకరణకు సంబంధించి 38పేజీలతో కూడిన నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికను శుక్రవారం ఎంపీపీ అభ్యర్థి జబీన్‌కు, హైకోర్టుకు జిల్లా కలెక్టర్ పంపారు.