రమ్య హత్య కేసు(Ramya murder case) నిందితుడిని శిక్షించకపోవటంపై గుంటూరులోని లాడ్జి సెంటర్‌లో తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. మహిళలపై జరిగే దాడులు, హత్యలకు సంబంధించి నిందితులను 21 రోజుల్లో శిక్షించేందుకు దిశ చట్టం తెచ్చామని చెప్పిన ప్రభుత్వం.. ఎందుకు ఆ పని చేయలేకపోతోందని ప్రశ్నించారు. 21 రోజుల్లో రమ్య హత్య కేసు నిందితుల్ని శిక్షించాలని తెదేపా డిమాండ్ చేసింది. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల జెండాలు పట్టుకుని తెలుగు యువత, మహిళలు నిరసన చేపట్టారు. 'దిశ చట్టం' పేరుతో ప్రభుత్వం మహిళల్ని మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆగస్టు 15 పట్టపగలే నడిరోడ్డుపై జనం చూస్తుండగానే బీటెక్ విద్యార్థిని రమ్యను (20) శశికృష్ణ (24) అనే యువకుడు కత్తితో పొడిచి అత్యంత పాశవికంగా హతమార్చాడు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారిలో పరమయ్యగుంట సెంటరువద్ద ఆగస్టు 15న ఉదయం 10 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. నిందితుడు శశికృష్ణను ఆ రోజు రాత్రి అతడి స్వగ్రామం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి సీఎం జగన్ రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.