ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంగం నిర్వీర్యానికే అమూల్​.. కోర్టు చెప్పినా మారని ప్రభుత్వ తీరు: శివరామయ్య - sangam director sivaramayya

కక్షసాధింపు చర్యలో భాగంగానే సంగం డెయిరీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెడుతున్నారని సంస్థ డైరెక్టర్​ శివరామయ్య అన్నారు. ఇదంతా అమూల్​ లబ్ధి కోసమే చేస్తున్నారని ఆరోపించారు.

tdp leader sivaramayya fire on gov
సంగం నిర్వీర్యానికే అమూల్

By

Published : Jun 12, 2021, 9:26 PM IST

కక్షసాధింపు చర్యలో భాగంగానే సంగం డెయిరీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టారని తెదేపా నేత, సంగం డెయిరీ డైరెక్టర్ శివరామయ్య ఆరోపించారు. పాడి రైతుల సంక్షేమం కోసం సంగం డెయిరీని ఏర్పాటు చేస్తే.. నేడు ఉద్దేశ్యపూర్వకంగా దానిని మూసివేసేందుకు వైకాపా ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని గుంటూరు తెదేపా జిల్లా పార్టీ కార్యాలయంలో అన్నారు. ఈ విషయంలో ఇప్పటికే న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి చివాట్లు పెట్టినా.. ఏసీబీ విచారణ కొనసాగించడం సరికాదన్నారు.

సంస్థలో డైరెక్టర్లకు సర్వ హక్కులు ఉంటాయని న్యాయస్థానం చెప్పినా.. ఏసీబీ, విజిలెన్స్ అధికారులు సోదాలు చేయడం తగదన్నారు. వ్యాపారాన్ని విస్తరింపజేస్తే అదేదో పెద్ద నేరమంటూ.. భారీగా అవకతవకలు జరిగాయని ఛైర్మన్ ధూళిపాళ్లపై కేసులు పెట్టడాన్ని తప్పుపట్టారు. సంగం డెయిరీ రాజకీయాలకు అతీతంగా ఉండే సంస్థ అని ఆయన పేర్కొన్నారు.

విజయవాడలో 12 మంది డైరెక్టర్లతో సంస్థ అభివృద్ధిపై సమావేశం ఏర్పాటు చేసుకుంటే.. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని కేసులు పెట్టడం దారుణమన్నారు. వైకాపా నేతలు వందలమందితో కలసి సమావేశాలు పెట్టుకుంటే.. అక్కడ కరోనా నిబంధనలు వర్తించవా అంటూ ప్రశ్నించారు. పాడి రైతుల కోసం ఏర్పాటు చేసిన సంగం డెయిరీని నిర్వీర్యం చేసి.. అమూల్​కు ఆస్తులు కూడబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో గుజరాత్​లో ఉన్న అమూల్​ సంస్థను తెచ్చి ఏపీలోని సంగం డెయిరీని అణచి వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. వైకాపా అవలంభిస్తున్న నిరంకుశ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని.. రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు.

ABOUT THE AUTHOR

...view details