TDP Leader Payyavula Keshav Press Meet: టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచి వచ్చిన సమయంలో ప్రజలు నీరాజనాలు పలికారని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబు తప్పు చేయలేదని ప్రజలు నమ్మారని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పయ్యావుల కేశవ్ మాట్లాడారు.
ప్రజాభిమానం కట్టలు తెంచుకుంటే:రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లి వరకు సాగిన 14 గంటల ప్రయాణంలో అడుగడుగునా ప్రజలు చంద్రబాబుకు స్వాగతం పలికారని.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనం వచ్చారని పయ్యావుల కేశవ్ చెప్పారు. చంద్రబాబు.. ఎక్కడన్నా కారు దిగిన సందర్భం లేదని.. ప్రజాభిమానం కట్టలు తెంచుకుంటే ఎలా ఉంటుందో తాను చూశానని పయ్యావుల అన్నారు. చంద్రబాబు తప్పు చేయలేదని ప్రజలకు నమ్మకమని.. 70 దేశాల్లో ఆయనకు మద్దతు పలికిన సందర్భమిదని స్పష్టం చేశారు. చంద్రబాబుకు బాసటగా నిలిచిన ప్రతిఒక్కరికీ ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ నమస్కారాలు తెలియజేశారు.
పదేపదే అసత్యాలు: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని తాము ముందే చెప్పామన్నారు. 50 రోజులకు పైగా చంద్రబాబును జైలులో ఉంచారని.. 50 పైసలైనా ఆయనకు వచ్చాయని నిరూపించగలిగారా అంటూ పయ్యావుల కేశవ్ నిలదీశారు. పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తే ఆరోపణలు నిజమవుతాయా? అని ఆయన మండిపడ్డారు.
భారత ప్రభుత్వం కూడా ఒప్పందం చేసుకుంది:ఎంవోయూపై తేదీ లేదని.. 90-10 పద్ధతి అనేదే కాదని ఏదోదే చెబుతున్నారని.. 90-10 పద్ధతిని గుజరాత్ మాత్రమే కాదు.. మరో 5 రాష్ట్రాలు చేశాయని పయ్యావుల తెలిపారు. డబ్బు విడుదలకు ముందే 10 శాతం పెట్టుబడి అని స్పష్టంగా ఉందని.. సీమెన్స్ సంస్థతో 2017 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. భారత ప్రభుత్వం కూడా 90-10 పద్ధతిన ఒప్పందం చేసుకుందని.. మంచి ఒప్పందమని కేంద్ర కార్యదర్శే లేఖ రాశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఒప్పందంపైనా ఈడీతో విచారణ చేయించాలంటారా? అని పయ్యావుల నిలదీశారు.